హోటల్ వీడియో లీక్ వ్యవహారంలో కోహ్లీ సరిగానే వ్యవహరించాడు: కోచ్ ద్రావిడ్

  • పెర్త్ లో కోహ్లీ హోటల్ రూం దృశ్యాలు లీక్
  • కోహ్లీ లేని సమయంలో గదిలో ప్రవేశించిన హోటల్ సిబ్బంది
  • కోహ్లీ వస్తువులతో వీడియో చిత్రీకరణ
  • ఇది తీవ్ర అసహనం కలిగించే విషయం అని ద్రావిడ్ వెల్లడి
టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ హోటల్ గదిలో లేని సమయంలో హౌస్ కీపింగ్ సిబ్బంది ఆ గదిలో ప్రవేశించి వీడియో తీయడం తీవ్ర కలకలం రేపింది. దీనిపై కోహ్లీ తీవ్రంగా స్పందించాడు. ఆటగాళ్ల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడం సబబు కాదని హితవు పలికాడు. ఆటగాళ్ల వ్యక్తిగత జీవితం ఓ వినోద వస్తువులా మారిపోయిందని ఆక్రోశించాడు. ఈ ఘటనపై పెర్త్ లోని క్రౌన్ టవర్స్ హోటల్ యాజమాన్యం కోహ్లీకి క్షమాపణలు తెలిపింది. 

ఈ నేపథ్యంలో, టీమిండియా కోచ్ రాహుల్ ద్రావిడ్ స్పందించారు. ఇది తీవ్ర అసహనం కలిగించే అంశం అని, విరాట్ ఒక్కడికే కాదు, ఇది ఎవరికీ ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు. 

ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత కోహ్లీ సరిగానే వ్యవహరించాడని భావిస్తున్నామని ద్రావిడ్ తెలిపారు. ఈ ఘటన పట్ల అతడు ఎంతో హుందాగా నడుచుకున్నాడని పేర్కొన్నారు. ఈ ఘటనపై ఎలా వ్యవహరించాలో అలాగే వ్యవహరించాడని వివరించారు. 

ఈ వీడియోపై సంబంధిత వర్గాలకు ఫిర్యాదు చేశామని, వారు స్టాఫ్ పై చర్యలు తీసుకున్నారని వెల్లడించారు.

బయట ప్రజల తాకిడి నుంచి, మీడియా ఒత్తిళ్ల నుంచి తప్పించుకునేందుకు ఆటగాళ్లకు హోటల్ గదే రక్షణ కల్పిస్తుందని, అలాంటి చోట కూడా భద్రత లేకపోవడం, వ్యక్తిగత గోప్యతకు భంగం కలగడం తీవ్ర అసంతృప్తి కలిగించే విషయం అని ద్రావిడ్ అభిప్రాయపడ్డారు.


More Telugu News