నాడు - నేడు అద్భుతమైన కార్యక్రమమేమీ కాదు: మంత్రి బొత్స సత్యనారాయణ

  • నాడు - నేడుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మంత్రి బొత్స
  • ప్రభుత్వ స్కూళ్లు గతంలో ఎలా ఉన్నాయి?.. ఇప్పుడెలా ఉన్నాయో చెప్పే పథకమని వ్యాఖ్య
  • అన్నీ ప్రజలకు చెప్పి చేయాలంటే కుదరదన్న విద్యా శాఖ మంత్రి
  • నోట్ల రద్దును ప్రజలను అడిగే మోదీ తీసుకున్నారా? అని ప్రశ్న
ఏపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కార్యక్రమం నాడు - నేడు. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్కూళ్ల మాదిరిగా మార్చేసే ఈ కార్యక్రమానికి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అత్యధిక ప్రాధాన్యమిస్తున్నారు. ఈ కార్యక్రమం కోసం పెద్ద ఎత్తున నిధులను విడుదల చేస్తున్న జగన్ సర్కారు... ఆ నిధులతో జరిగే పనుల్లో ఉపాధ్యాయుల సేవలను కూడా పూర్తిగా వినియోగించుకుంటోంది. ఇలాంటి పథకంపై రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మంగళవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

నాడు - నేడు అద్భుతమైన కార్యక్రమమేమీ కాదని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం. ప్రభుత్వ పాఠశాలల గత పరిస్థితి, ప్రస్తుత పరిస్థితిని వివరించి చెప్పడం మాత్రమే ఈ పథకం ఉద్దేశమని తెలిపారు. నాలుగేళ్ల పరిస్థితులతో ప్రస్తుత విద్యా రంగ పరిస్థితులను బేరీజు వేసి చూసుకోవాలని ఆయన కోరారు. తమ విధానాలు బాగా లేకపోతే ఎన్నికల్లో తామే నష్టపోతామని ఆయన అన్నారు. అయినా ప్రతి విషయాన్ని ప్రజలను అడిగి చేయలేమన్నారు. ప్రజలను అడిగాకే ప్రధాని నరేంద్ర మోదీ నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నారా? అని ఆయన ప్రశ్నించారు. ఐదో తరగతి దాకా మాతృభాషలోనే విద్యాభ్యాసమని చెప్పిన మోదీ... ఆ దిశగా ఎందుకు చట్టం చేయలేదని బొత్స అన్నారు. 2014లో ప్రభుత్వ బడుల్లో 42 లక్షల మంది విద్యార్థులుంటే... 2019 నాటికి ఆ సంఖ్య 37 లక్షలకు ఎందుకు తగ్గిందని ఆయన ప్రశ్నించారు.


More Telugu News