పుల్వామా దాడుల పట్ల సంబరాలు చేసుకున్న బెంగళూరు విద్యార్థికి ఐదేళ్ల జైలు శిక్ష

  • 2019లో పుల్వామా ఉగ్రదాడి
  • 40 మంది జవాన్ల వీరమరణం
  • హర్షం వ్యక్తం చేస్తూ ఫేస్ బుక్ లో పోస్టు చేసిన విద్యార్థి
  • అరెస్ట్ చేసిన పోలీసులు
మూడేళ్ల కిందట పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు వీరమరణం పొందడం తెలిసిందే. 2019 ఫిబ్రవరి 14న జరిగిన ఈ ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. కాగా, ఈ ఉగ్రదాడిలో జవాన్లు మరణించడం పట్ల సంబరాలు చేసుకున్న బెంగళూరు విద్యార్థికి న్యాయస్థానం ఐదేళ్ల సాధారణ జైలు శిక్ష విధించింది. 

ఆ ఇంజినీరింగ్ విద్యార్థి పేరు ఫయాజ్ రషీద్. పుల్వామా దాడి జరిగిన అనంతరం అతడు ఫేస్ బుక్ లో ఉగ్రదాడిని సమర్థిస్తూ పోస్టు చేశాడు. దాంతో అతడిని బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. అతడు ఉద్దేశపూర్వకంగానే ఆ పోస్టు పెట్టాడని నిర్ధారణ కావడంతో స్పెషల్ కోర్టు జైలు శిక్ష విధించింది. శిక్షాకాలంలో అతడు ఎలాంటి తప్పిదానికి పాల్పడినా మరో 6 నెలల అదనపు జైలుశిక్ష అనుభవించాల్సి ఉంటుందని న్యాయస్థానం స్పష్టం చేసింది. 

ప్రొబేషన్ సమయంలో సత్ప్రవర్తన కారణంగా విడుదల చేయాలని రషీద్ తరపు న్యాయవాది కోర్టును కోరగా... దేశభక్తులు వీరమరణం పొందిన సమయంలో సంబరాలు చేసుకోవడం చూస్తుంటే అతడు ఎలాంటివాడో తెలుస్తోందని న్యాయమూర్తి జస్టిస్ గంగాధర అభిప్రాయపడ్డారు. తప్పిదానికి పాల్పడిన సమయంలో అతడేమీ నిరక్షరాస్యుడో, సాధారణ వ్యక్తో కాదని, ఓ ఇంజినీరింగ్ స్టూడెంట్ అని పేర్కొన్నారు. జవాన్లను చంపడాన్ని అతడు సమర్థించిన తీరు శిక్షార్హం అని స్పష్టం చేశారు.


More Telugu News