తిరుపతిలో సర్వదర్శనం టోకెన్ల ప్రక్రియను ప్రారంభించిన టీటీడీ

  • శ్రీవారి సర్వదర్శనానికి మళ్లీ టోకెన్ల ప్రక్రియ
  • తిరుపతిలోని వివిధ కేంద్రాలలో టోకెన్లు
  • టోకెన్లు దొరకని వారికి వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2 ద్వారా దర్శనం
  • టీటీడీ ఈవో వెల్లడి
శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల జారీ ప్రక్రియను టీటీడీ నేడు పునఃప్రారంభించింది. తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, గోవిందరాజస్వామి సత్రాలు, శ్రీనివాసం కేంద్రాల్లో టైమ్ స్లాట్ ఉచిత దర్శనం టోకెన్లను జారీ చేస్తోంది. భక్తులు ఈ ఉదయం నుంచి సర్వదర్శనం టోకెన్లు అందుకుంటున్నారు. కాగా, ఆధార్ కార్డుతో ఒకసారి సర్వదర్శనం టోకెన్ తీసుకుంటే నెల రోజుల వ్యవధిలో మరోసారి టోకెన్ తీసుకోవడం సాధ్యం కాదు. 

ఇవాళ మొదటి రోజున తిరుపతిలోని వివిధ కేంద్రాల్లో టోకెన్లు పొందిన భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టోకెన్ల కోటాను విడుదల చేయనున్నారు. శని, ఆది, సోమ, బుధవారాల్లో 25 వేలు చొప్పున టోకెన్లు కేటాయించనున్నారు. మంగళ, గురు, శుక్రవారాల్లో 15 వేలు చొప్పున టోకెన్లు కేటాయించనున్నారు. 

టోకెన్ పొందిన భక్తులు అదే రోజున దర్శనం చేసుకునే ఏర్పాట్లు చేసినట్టు టీటీడీ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. తిరుపతిలో టోకెన్లు దొరకని భక్తులు తిరుమల చేరుకుని వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2 ద్వారా శ్రీవారి దర్శనం చేసుకోవచ్చని తెలిపారు.


More Telugu News