కీలక విజయంతో టీ20 ప్రపంచకప్ సెమీస్ రేసులో నిలిచిన శ్రీలంక

  • ఆఫ్ఘనిస్థాన్ పై ఆరు వికెట్లతో గెలుపు
  • రాణించిన బౌలర్లు, ధనంజయ డిసిల్వా
  • నాలుగు మ్యాచ్ లలో గెలుపు రుచి చూడని ఆఫ్ఘన్ ఆశలు గల్లంతు
టీ20 ప్రపంచ కప్ లో శ్రీలంక కీలక విజయం సాధించి సెమీఫైనల్ ఆశలు సజీవంగా నిలుపుకుంది. నాలుగు మ్యాచ్ ల్లో గెలుపు రుచి చూడని ఆఫ్ఘనిస్థాన్ సెమీస్ రేసు నుంచి వైదొలిగింది. 

సూపర్ 12 గ్రూప్-1లో భాగంగా ఈ ఉదయం బ్రిస్బేన్ లో జరిగిన మ్యాచ్ లో శ్రీలంక 6 వికెట్ల తేడాతో ఆఫ్ఘనిస్థాన్ ను చిత్తు చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘన్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. రహ్మనుల్లా గుర్బాజ్ (28), ఉస్మాన్ ఘని (27), ఇబ్రహీం జద్రాన్ (22) రాణించారు. శ్రీలంక బౌలర్లలో స్పిన్నర్ వానిందు హసరంగ మూడు వికెట్లతో సత్తా చాటగా.. లాహిరు కుమార రెండు వికెట్లు పడగొట్టాడు. 

అనంతరం బ్యాటింగ్ కు దిగిన శ్రీలంక 18.3 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసి సులువుగా గెలిచింది. ధనంజయ డిసిల్వా (66 నాటౌట్) అర్ధ శతకంతో లంకకు విజయం అందించాడు. కుశాల్ మెండిస్ (25) కూడా రాణించాడు. 

నాలుగు మ్యాచ్ లలో రెండు విజయాలు, రెండు ఓటములతో శ్రీలంక నాలుగు పాయింట్లతో గ్రూప్-1లో మూడో స్థానంలో ఉంది. నాలుగు మ్యాచ్ లలో రెండింటిలో ఓడిన ఆఫ్ఘన్.. రెండు మ్యాచ్ లు రద్దవడం ద్వారా రెండు పాయింట్లు సాధించింది. పట్టికలో చివరి స్థానంలో ఉన్న ఆ జట్టు సెమీఫైనల్ రేసు నుంచి తప్పుకుంది.


More Telugu News