బాలీవుడ్ ప్రముఖులకు భద్రత పెంచిన మహారాష్ట్ర

  • సల్మాన్ ఖాన్ కు వై ప్లస్ కేటగిరీ భద్రత
  • ఆయన్ను లక్ష్యంగా చేసుకున్నట్టు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుల వెల్లడి
  • అనుపమ్ ఖేర్, అక్షయ్ కుమార్ కు ఎక్స్ కేటగిరీ భద్రత
పలువురు బాలీవుడ్ ప్రముఖులకు మహారాష్ట్ర సర్కారు భద్రతను పెంచినట్టు తెలుస్తోంది. సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, అనుపమ్ ఖేర్ తదితరులు ఇందులో ఉన్నారు. వీరిలో సల్మాన్ ఖాన్.. గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్రూపు నుంచి లోగడ బెదిరింపులు ఎదుర్కొన్నారు. సల్మాన్ ఖాన్ తోపాటు, ఆయన తండ్రి సలీమ్ ఖాన్ కు ఈ ఏడాది జూన్ లో బెదిరింపు లేఖ రావడం కలకలం సృష్టించింది. 

పంజాబీ యువ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్యకు పాల్పడింది బిష్ణోయ్ ముఠానే కావడం గమనార్హం. అనంతరం ముంబై పోలీసులు లారెన్స్ బిష్ణోయ్ ముఠాలోని పలువురుని అరెస్ట్ చేశారు. సల్మాన్ ఖాన్ తమ టార్గెట్ అని వారు విచారణలో పోలీసులకు వెల్లడించినట్టు తెలిసింది. దీంతో సల్మాన్ ఖాన్ కు ప్రస్తుతమున్న భద్రతను పెంచి, వై ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలని మహారాష్ట్ర సర్కారు నిర్ణయించింది. ఇప్పటి వరకు ఆయనకు సాధారణ పోలీసు రక్షణ మాత్రమే ఉంది. వై ప్లస్ కేటగిరీలో ఆయుధాలు ధరించిన నలుగురు ఎప్పుడూ సల్మాన్ ను కాచుకుని ఉంటారు. అలాగే, అక్షయ్ కుమార్, అనుపమ్ ఖేర్ లకు ఎక్స్ కేటగిరీ భద్రత ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఎక్స్ కేటగిరీ రక్షణలో ముగ్గురు సాయుధ పోలీసులు ఎప్పుడూ రక్షణగా ఉంటారు.


More Telugu News