చైనీయులకు నిరసన అస్త్రంగా మారిన బప్పీలహరి సాంగ్

  • జీ మీ, జీ మీ అంటూ ఖాళీ పాత్రలతో నిరసన వ్యక్తీకరణ
  • బప్పీలహరి బాణీలు సమకూర్చిన జిమ్మీ, జిమ్మీ ఆజా ఆజా పాటకు అనువాదం
  • జీరో కోవిడ్ విధానంతో ఆహారం దొరకని పరిస్థితి
ప్రముఖ సంగీత దర్శకుడు బప్పీలహరి కంపోజ్ చేసిన ‘జిమ్మీ, జిమ్మీ’ సాంగ్ ఇప్పుడు చైనీయులకు నిరసన అస్త్రంగా మారింది. కరోనా వైరస్ కేసుల కట్టడికి చైనా సర్కారు జీరో కోవిడ్ పాలసీని కఠినంగా అమలు చేస్తున్న విషయం ప్రపంచం మొత్తానికి తెలుసు. ఒక్క కేసు వచ్చినా, ఆ ప్రాంతం మొత్తాన్ని లాక్ డౌన్ చేసేస్తోంది. దీంతో ప్రజలు ఇంట్లోనే ఉండిపోవాల్సి వస్తోంది. దీంతో తినడానికి ఆహార పదార్థాల కొరత ఏర్పడి ఎంతో మంది పస్తులు ఉండాల్సి వస్తోంది. దీంతో కడుపు మండిన చైనీయులు ఇళ్ల నుంచే నిరసన తెలియజేస్తున్నారు. 

చైనాలో సామాజిక మాధ్యమం డూయిన్ ద్వారా వారు తమ బాధను వ్యక్తం చేస్తున్నారు. 1982లో 'డిస్కో డాన్సర్' సినిమా కోసం బప్పీలహరి బాణీలు సమకూర్చిన జిమ్మీ జిమ్మీ ఆజా ఆజా పాటను పార్వతి ఖాన్ ఆలపించారు. దీన్నే చైనా మాండరీన్ భాషలోకి అనువదిస్తే ‘జీ మీ, జీ మీ’ అని వస్తుంది. దీని ఇంగ్లిష్ అనువాదం గివ్ మీ రైస్, గివ్ మీ రైస్. చైనీయులు ఖాళీ పాత్రలను పట్టుకుని జీ మీ, జీ మీ అని ఆలపిస్తున్న వీడియోలు సామాజిక మాధ్యమంపై చక్కర్లు కొడుతున్నాయి. హిందీ పాటలకు చైనాలో మంచి ఆదరణే ఉందన్న విషయం గమనార్హం.


More Telugu News