ఈ కష్ట సమయంలో భారత్ కు అండగా ఉంటాం: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్

  • గుజరాత్ తీగల వంతెన ప్రమాదంపై అమెరికా అధ్యక్షుడు బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ స్పందన
  • సంతాపం వ్యక్తం చేసిన అగ్రరాజ్యం అధినేతలు
  • నేడు మోర్బీని సందర్శించనున్న ప్రధాని మోదీ
గుజరాత్‌లోని మోర్బీ తీగల వంతెన కూలి భారీ సంఖ్యలో ప్రాణ నష్టం జరిగిన ఘటనపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, కమలా హారిస్ స్పందించారు. దుర్ఘటనపై ఇద్దరూ సంతాపం వ్యక్తం చేశారు. ఈ కష్ట సమయంలో తాము భారతీయ ప్రజలకు అండగా నిలుస్తామని, మద్దతు ఇస్తామని చెప్పారు. ‘భారత్ లో వంతెన కూలిన ఘటనలో సన్నిహితులను కోల్పోయిన కుటుంబాలకు జిల్ (బైడెన్ భార్య), నేను మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము. ఈ క్లిష్ట సమయంలో మేము భారత ప్రజలకు అండగా నిలుస్తాము’ అని బైడెన్ ట్వీట్ చేశారు. 

ఆదివారం సాయంత్రం గుజరాత్‌లోని మోర్బీ జిల్లాలో మచ్చు నదిలో కేబుల్ వంతెన కూలిపోవడంతో 130 మందికి పైగా మరణించారు. పలువురు గాయపడ్డారు. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ కూడా ఈ దుర్ఘటనపై తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో కుటుంబ సభ్యులను కోల్పోయిన వారి గురించి ఆలోచిస్తున్నానని ఆమె ట్వీట్ చేశారు. కాగా, ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం మోర్బీలో పర్యటించి, వంతెన కూలిన ప్రాంతాన్ని సందర్శించనున్నారు.


More Telugu News