యాదాద్రిలోనూ ప్రారంభమైన తిరుమల తరహా బ్రేక్ దర్శనాలు

  • ఉదయం 9-10, సాయంత్రం 4-5 గంటల మధ్య బ్రేక్ దర్శనాలు
  • కార్తీక మాసం తొలి సోమవారం సందర్భంగా టికెట్లు తీసుకున్న 292 మంది భక్తులు
  • సత్యనారాయణ వ్రతాల ద్వారా రూ. 2,83,200 ఆదాయం
  • చంద్రగ్రహణం సందర్భంగా 8న ఆలయం మూత
తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రిలో తిరుమల తరహా బ్రేక్ దర్శనాలు ప్రారంభమయ్యాయి. ఆలయంలో నిన్నటి నుంచి వీవీఐపీ, వీఐపీ బ్రేక్ దర్శనాలను ప్రవేశపెట్టారు. ప్రతి రోజు ఉదయం 9 నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 5 వరకు రెండు గంటలపాటు బ్రేక్ దర్శనాలు కల్పిస్తున్నట్టు ఆలయ ఈవో గీత తెలిపారు. కాగా, కార్తీకమాసం తొలి సోమవారం సందర్భంగా రెండు దఫాలుగా 292 మంది భక్తులు ఈ టికెట్లు తీసుకున్నారని, వీటి ద్వారా రూ. 87,600 ఆదాయం సమకూరినట్టు చెప్పారు. 

కార్తీకమాసం తొలి సోమవారం సందర్భంగా యాదాద్రి నిన్న భక్తులతో కిటకిటలాడింది. 354 జంటలు సత్యనారాయణస్వామి వ్రతాల్లో పాల్గొన్నాయి. వీటి ద్వారా రూ. 2,83,200 ఆదాయం ఆలయానికి సమకూరింది. కాగా, సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా ఈ నెల 8న యాదాద్రిలోని ప్రధాన, అనుబంధ ఆలయాలను మూసివేయనున్నారు. ఆ రోజున ఉదయం 8.15 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ద్వారబంధనం జరుగుతుందని ఈవో గీత తెలిపారు. కార్తీక పౌర్ణమి రోజున మధ్యాహ్నం 2.37 గంటలకు గ్రహణం ప్రారంభమై సాయంత్రం 6.19 గంటలకు వీడుతుంది.


More Telugu News