మోర్బీ వంతెన ప్రమాదాన్ని రాజకీయం చేయదల్చుకోలేదు: రాహుల్ గాంధీ

  • గుజరాత్ లో కూలిపోయిన కేబుల్ బ్రిడ్జి
  • 130 మందికి పైగా మరణం
  • రాజకీయ కోణంలో ఈ ఘటనను చూడరాదన్న రాహుల్
  • ప్రజలు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన 
గుజరాత్ లోని మోర్బీ వద్ద మచ్చూ నదిపై కేబుల్ బ్రిడ్జి కూలిపోయిన ఘటనలో 130 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం తెలిసిందే. మృతుల్లో 47 మంది చిన్నారులు ఉండడం అందరినీ మరింతగా కలచివేసింది. ఈ ఘటనపై రాహుల్ గాంధీ స్పందించారు. 

ప్రస్తుతం తెలంగాణలో భారత్ జోడో యాత్ర నిర్వహిస్తున్న ఆయనను మీడియా పలకరించింది. మోర్బీ వంతెన ప్రమాదానికి ఎవరు బాధ్యత వహించాలని మీరు భావిస్తారు? అంటూ మీడియా రాహుల్ ను ప్రశ్నించింది. అందుకు రాహుల్ బదులిస్తూ, ఈ దుర్ఘటనను రాజకీయం చేయదల్చుకోలేదని స్పష్టం చేశారు. 

ఈ ఘటనలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారని, ఒకవేళ దీనిపై ఏదైనా రాజకీయపరమైన వ్యాఖ్యలు చేయాల్సి వస్తే, మృతుల పట్ల అవమానకరంగా ప్రవర్తించడమే అవుతుందని పేర్కొన్నారు. అందుకే ఈ ఘటనపై రాజకీయ కోణంలో వ్యాఖ్యలు చేయలేనని రాహుల్ గాంధీ వివరించారు. 

కాగా, ఇతర కాంగ్రెస్ నేతలు మాత్రం ఈ ఘటన నేపథ్యంలో తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు రణదీప్ సూర్జేవాలా స్పందిస్తూ, ఇది సహజసిద్ధంగా జరిగిన ఘటన కాదని, మానవ తప్పిదమే ఈ విషాదానికి కారణమని పేర్కొన్నారు. ఈ ఘోరానికి గుజరాత్ లోని బీజేపీ ప్రభుత్వమే బాధ్యత వహించాలని తెలిపారు. 

మృతుల కుటుంబాలకు ప్రధాని మోదీ, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ ఎక్స్ గ్రేషియా ప్రకటించడంపైనా సూర్జేవాలా విమర్శలు చేశారు. గుజరాత్ సోదరసోదరీమణుల ప్రాణాలకు రూ.2 లక్షల పరిహారంతో ఖరీదు కట్టిన ప్రధాని, సీఎం తమ బాధ్యతల నుంచి తప్పించుకోజాలరని స్పష్టం చేశారు. 

అటు, త్రిపుర కాంగ్రెస్ ఇన్చార్జి డాక్టర్ అజయ్ కుమార్ స్పందిస్తూ, మోర్బీ వంతెన ప్రమాదం మోసానికి ఫలితంగానే జరిగిందని, ఇది మోదీకి దేవుడు పంపిన సందేశం అని వ్యాఖ్యానించారు.


More Telugu News