ఓ తలమాసినోడు వచ్చి తడిగుడ్డలతో ప్రమాణం చేస్తావా అంటాడు!: చండూరులో కేసీఆర్

  • మునుగోడులో ప్రచార సభలో పాల్గొన్న కేసీఆర్
  • నవంబరు 3న ఉప ఎన్నిక
  • ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలన్న కేసీఆర్
  • ఫలితాలు వెంటనే కనిపిస్తాయని వెల్లడి
మునుగోడులో యుద్ధం చేయాలని టీఆర్ఎస్ కార్యకర్తలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. మునుగోడు ఉప ఎన్నిక నవంబరు 3న జరగనుండగా, టీఆర్ఎస్ పార్టీ నేడు చండూరులో రణభేరి సభ ఏర్పాటు చేసింది. ఈ సభకు విచ్చేసిన సీఎం కేసీఆర్ ప్రధానంగా బీజేపీని లక్ష్యంగా చేసుకుని విమర్శనాస్త్రాలు సంధించారు. 

20, 30 మంది ఎమ్మెల్యేలను కొని కేసీఆర్ ను పడగొట్టాలని చూశారని వ్యాఖ్యానించారు. ఢిల్లీ నుంచి దొంగతనంగా వచ్చి తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నం చేసి జైలుపాలయ్యారని అన్నారు. 

"ఓ తలమాసినోడు వచ్చి తడిగుడ్డలతో ప్రమాణం చేస్తావా అంటాడు, ఇంకొకడు వచ్చి పొడి బట్టలతో ప్రమాణం చేస్తావా అంటాడు. ఇది రాజకీయమా? దొరికిన దొంగలు జైల్లో ఉన్నారు. ఈ కేసు న్యాయస్థానంలో ఉంది కాబట్టి దీనిపై ఇంతకుమించి మాట్లాడలేను. నేను రాజ్యాంగబద్ధమైన ముఖ్యమంత్రి పదవిలో ఉన్నాను. నేను మాట్లాడితే దీన్ని ప్రభావితం చేశానని అంటారు. 

కానీ ఒక్క మాట మాత్రం చెబుతాను... నిన్న మొన్న మీరు టీవీలో చూసింది కొంతే... చూడాల్సింది చాలానే ఉంది. ఢిల్లీ పీఠమే కదిలిపోయే పరిస్థితి ఉన్నది. రాబోయే రోజుల్లో అన్నీ బయటపడతాయి. ఈ దుర్మార్గులను కూకటివేళ్లతో సహా పెకలించి బంగాళాఖాతంలో విసిరేస్తే తప్ప భారతదేశానికి నిష్కృతి లేదు. ఈ మతోన్మాదులను, ఈ పెట్టుబడిదారుల తొత్తులను తరిమికొట్టకపోతే  ఈ దేశం బాగుపడదు. మునుగోడులో బీజేపీని గెలిపిస్తే అరాచకాలకు అంతే ఉండదు... ఆ తర్వాత మేం చేసేది ఏమీ ఉండదు" అని స్పష్టం చేశారు. 

ఈ అరాచకాలను మోదీ ఎందుకు ప్రోత్సహిస్తున్నారు? రెండు సార్లు ప్రధాని అయిన మోదీకి ఇంకా ఏంకావాలి? అంటూ కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మునుగోడు ప్రజలు నవంబరు 3వరకు అప్రమత్తంగా ఉండి, బ్రహ్మాండంగా ఈ చైతన్యాన్ని ఇలాగే కాపాడుకుంటూ ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. 

"వడ్లు కొనాలని కోరితే నూకలు తినాలని చెబుతారు. మనం నూకలు తినాలా? ఎవడైతే మనల్ని నూకలు తినమన్నాడో, ఈ ఎన్నికల ద్వారా వాని తోక కత్తిరించాలి. ప్రలోభాల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ఎన్నికలప్పుడు వచ్చి మందుగుండు సామగ్రి తెస్తారు, ఇంటికి తులం బంగారం అంటారు, చంటిపిల్లల ముక్కుకు చీమిడి ఉంటే తుడుస్తారు... కానీ 3వ తేదీ ఎన్నికలు పూర్తయితే ఒక్కరు కనిపించరు. ఇదే ప్రభాకర్ రెడ్డి, ఇదే కేసీఆర్, ఇదే సీపీఐ జెండాలు తప్ప మరొకరు కనిపించరు. 

మనకు చైతన్యం ఉంటే స్వార్థ శక్తుల ఆటలు సాగవు. దయచేసి మీ అందరినీ కోరేది ఒక్కటే. మునుగోడులో మీ బిడ్డ ప్రభాకర్ రెడ్డిని గెలిపించండి. మీ ప్రాజెక్టులు పూర్తి చేసే బాధ్యత నాది. చండూరును డివిజన చేసే బాధ్యత నాది. మీకు 100 పడకల ఆసుపత్రి ఇచ్చే బాధ్యత నాది. మీ రోడ్లను బాగు చేసే బాధ్యత నాది. ఇవేవీ సాధ్యంకాని పెద్ద పనులేవీ కాను. టీఆర్ఎస్ ను గెలిపిస్తే ఫలితాలు మీకు వెంటనే కనిపిస్తాయి. కారు గుర్తుకే మీ ఓటు" అని స్పష్టం చేశారు.


More Telugu News