సమంతకు వచ్చిన 'మయోసైటిస్' వ్యాధి అంటే ఏమిటి? ఈ వ్యాధి లక్షణాలు ఏమిటి?

  • మయోసైటిస్ దీర్ఘకాలిక కండరాల వ్యాధి
  • ఈ వ్యాధి ఎందుకు వచ్చిందనే విషయాన్ని కూడా కొన్ని సార్లు నిర్ధారించలేం
  • ఈ వ్యాధికి సరైన మెడికేషన్ కూడా లేని వైనం
  • చికిత్స పొందకపోతే ప్రాణాంతకంగా మారే అవకాశం
  • ఫిజియోథెరపీ, వ్యాయామం, యోగా వల్ల ఉపయోగం
తాను కొంత కాలంగా మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్నానంటూ సమంత వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాధికి చికిత్స పొందుతున్న ఫొటోను కూడా ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసింది (కింద ఉన్న మరో వార్తలో సమంత ఫొటో చూడొచ్చు). దీంతో ఈ వ్యాధి ఏమిటనే దాని గురించి అందరూ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. 

ఈ వ్యాధిని దీర్ఘకాలిక కండరాల వాపు అని చెప్పుకోవచ్చు. ఈ వ్యాధి వచ్చిన వారిలో కొందరికి చర్మం దద్దుర్లు కూడా ఉంటాయి. ఈ అరుదైన వ్యాధిని నిర్ధారించడం కూడా కష్టమే. ఈ వ్యాధి ఎందుకు వచ్చిందనే విషయాన్ని కూడా కొన్ని సార్లు నిర్ధారించలేము. కాలక్రమేణా ఈ వ్యాధి లక్షణాలు చాలా వేగంగా కనిపిస్తాయి. కండరాల నొప్పి, పుండ్లు పడటం, అలసట, మింగడంలో ఇబ్బంది, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటివి ఈ వ్యాధి ప్రాథమిక లక్షణాలుగా చెప్పుకోవచ్చు. 

అమెరికాలో ప్రతి ఏటా ఈ కేసులు కొత్తగా 1,600 నుంచి 3,200 వరకు నమోదవుతుంటాయి. ప్రస్తుతం ఆ దేశంలో 50 వేల నుంచి 75 వేల వరకు మయోసైటిస్ వ్యాధిగ్రస్తులు ఉన్నారని అంచనా. మయోసైటిస్ లో ఐదు రకాలు ఉన్నాయి. డెర్మటో మయోసైటిస్, ఇంక్లూజన్ బాడీ మయోసైటిస్, జువెనైల్ మయోసైటిస్ (బాలలు), పాలీ మయోసైటిస్, టాక్సిక్ మయోసైటిస్ అనే రకాలు ఉన్నాయి. 

మయోసైటిస్ ఎందుకు వస్తుందనే విషయంలో నిపుణుల మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయి. స్వయం రక్షక స్థితిని కలిగి ఉండే మయోసైటిస్... శరీరం కండరాలపై దాడి చేస్తుంది. చాలా సందర్భాల్లో ఇది ఎందుకు వచ్చిందనే కారణాన్ని గుర్తించలేము. అయితే గాయం, ఇన్ఫెక్షన్ వంటివి ఈ వ్యాధిలో కీలక పాత్రను పోషిస్తాయనే విషయం మాత్రం గమనార్హం. రుమటాయిడ్ ఆర్థరైటిస్, లూపస్ వంటి స్వయం ప్రతిరక్షక వ్యాధులు, సాధారణ జలుబు, ఫ్లూ, హెచ్ఐవీ వంటి వైరస్ లు, విషపూరిత ఔషధాల వల్ల కూడా ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. కండరాల బలహీనత, అలసట అనేవి అనేక వ్యాధుల్లో సాధారణంగా కనిపించే లక్షణాలు కావడంతో... ఒక వ్యక్తికి మయోసైటిస్ వచ్చిందనే విషయాన్ని పక్కాగా అనుమానించడం కూడా కష్టమవుతుంది. 

మయోసైటిస్ కు ట్రీట్మెంట్ ఇవ్వడానికి ప్రత్యేకంగా ఎలాంటి మెడికేషన్ లేదు. Prednisone వంటి Corticosteroids డ్రగ్ ను డాక్టర్లు ప్రిస్క్రైబ్ చేస్తారు. ఈ డ్రగ్ ను Azathioprine (Azasan), Methotrexate (Trexall)తో కలిపి ఇస్తారు. ఈ వ్యాధి బారిన పడిన వారికి ఫిజియోథెరపీ, వ్యాయామాలు, స్ట్రెచ్చింగ్, యోగా వంటివి చాలా ఉపయోగపడతాయి. ఈ వ్యాధి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ, చికిత్స తీసుకోకపోతే... చివరకు ప్రాణాంతకం అయ్యే ప్రమాదం కూడా ఉంది.


More Telugu News