రాహుల్ గాంధీతో పూనం కౌర్ చర్చించిన అంశం ఇదేనట

  • భారత్ జోడో యాత్రలో రాహుల్ ను కలిసిన పూనం
  • రాహుల్ గాంధీతో కలిసి కొంత దూరం నడిచిన వైనం
  • చేనేత వస్త్రాలపై జీఎస్టీ రద్దు చేయాలంటూ ఎంపీల సంతకాలు సేకరిస్తున్నానన్న నటి
  • ఎంపీగా ఉన్న రాహుల్ తో సంతకం చేయించుకునేందుకు యాత్రకు వెళ్లానని వివరణ
  • తన తల్లిని ఓ సారి కలవండి అంటూ రాహుల్ చెప్పారన్న కౌర్
కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో తెలుగు సినీ నటి పూనం కౌర్ పాలుపంచుకున్న సంగతి తెలిసిందే. మహబూబ్ నగర్ జిల్లాలో సాగుతున్న ఈ యాత్రలో శనివారం పూనం కౌర్ పాల్గొన్నారు. రాహుల్ గాంధీతో కలిసి ఆమె కొంత దూరం నడిచారు కూడా. ఈ సందర్భంగా రాహుల్ గాంధీతో తానేం చర్చించానన్న విషయాన్ని శనివారం ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పూనం వెల్లడించారు. 

చేనేత వస్త్రాలపై విధిస్తున్న జీఎస్టీ పన్నును రద్దు చేయాలన్న అంశంపై తాను రాహుల్ గాంధీతో చర్చించానని పూనం చెప్పారు. చేనేత వస్త్రాలపై జీఎస్టీ రద్దు కోరుతూ అఖిల భారత పద్మశాలీ సంఘం గడచిన 8 నెలలుగా ఉద్యమం చేపడుతోందని చెప్పిన పూనం...ఆ ఉద్యమంలో తాను క్రియాశీలకంగా పాల్గొంటున్నానని తెలిపారు. ఇందులో భాగంగా చేనేత వస్త్రాలపై జీఎస్టీ రద్దు కోసం వీలయినంత ఎక్కువ మంది ఎంపీల సంతకాలు సేకరించే కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. ఇప్పటిదాకా 11 పార్టీలకు చెందిన 66 మంది ఎంపీల సంతకాలు సేకరించామన్నారు. రాహుల్ గాంధీ కూడా ఓ ఎంపీ అయినందున ఆయన సంతకాన్ని కూడా సేకరించేందుకే యాత్రకు వెళ్లానని ఆమె చెప్పారు. 

కరోనా కాలం నుంచి ఇప్పటిదాకా 376 మందికి పైగా చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని పూనం చెప్పారు. దేశంలో రైతుల ఆత్మహత్యల తర్వాత అత్యంత ఎక్కువగా జరుగుతున్న ఆత్మహత్యలు చేనేత కార్మికులవేనని ఆమె అన్నారు. రాజకీయ నాయకులకు సరిగ్గా ఎన్నికల ముందే సమస్యలన్నీ గుర్తుకు వస్తున్న తీరు తనకు బాధ కలిగిస్తోందన్నారు. చేనేత వస్త్రాలపై జీఎస్టీ తగ్గించాలని డిమాండ్ చేస్తున్న టీఆర్ఎస్ పార్టీ... తాను అధికారంలో ఉన్న తెలంగాణలో జీఎస్టీని రద్దు చేసి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు.

రాహుల్ గాంధీతో కలిసి నడుస్తున్న సందర్భంగా తాను సోనియా గాంధీ వస్త్రధారణ గురించి ఆయనతో మాట్లాడానని పూనం చెప్పారు. నిత్యం చేనేత చీరలను ధరిస్తున్న సోనియా గాంధీ అంటే తనకు ఇస్టమని, అంతేకాకుండా ఆ చీరలను ఆమె ధరిస్తున్న తీరు కూడా తనను ఎంతగానో ఆకట్టుకుంటోందని కూడా రాహుల్ గాంధీకి చెప్పానన్నారు. ఇదంతా విన్న రాహుల్ గాంధీ... తన తల్లిని ఓ సారి కలవాలంటూ తనకు సూచించారని పూనం తెలిపారు.


More Telugu News