టీ20 వరల్డ్​ కప్​లో మరో సెంచరీ.. న్యూజిలాండ్​ బ్యాటర్​ ఫిలిప్స్​ వీర విహారం

  • శ్రీలంక బౌలర్లపై రెచ్చిపోయిన ఫిలిప్స్ 
  • 15/3తో కష్టాల్లో పడ్డ జట్టును ఆదుకున్న వైనం
  • లంకకు 168 పరుగుల లక్ష్యం ఇచ్చిన కివీస్
ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచ కప్ లో మరో సెంచరీ నమోదైంది. న్యూజిలాండ్ బ్యాటర్ గ్లెన్ ఫిలిప్స్ సెంచరీతో వీరవిహారం చేశారు. సిడ్నీ వేదికగా శ్రీలంకతో మ్యాచ్ లో అతను మెరుపు సెంచరీ సాధించాడు. కేవలం 64 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 104 పరుగులు చేశాడు. దాంతో టాస్ నెగ్గి మొదట బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 167 పరుగుల స్కోరు సాధించింది. ఓపెనర్లు ఫిన్ అలెన్ (1), డెవాన్ కాన్వే (1)తో పాటు కెప్టెన్ కేన్ విలియమ్సన్ (8) నిరాశ పరచడంతో కివీస్ నాలుగు ఓవర్లకే 15/3తో కష్టాల్లో పడింది. 

ఈ దశలో ఫిలిప్స్ భారీ షాట్లతో శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడుతూ ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. డారిల్ మిచెల్ (22) సాయంతో నాలుగో వికెట్ కు 74 పరుగులు జోడించాడు. ఆపై, వరుసగా వికెట్లు పడుతున్నా.. ఫిలిప్స్ ఏ మాత్రం వెనక్కు తగ్గలేదు. అదే జోరు కొనసాగిస్తూ సెంచరీ పూర్తి చేసుకోవడంతో పాటు జట్టుకు మంచి స్కోరు అందించి చివరి ఓవర్లో ఔటయ్యాడు. శ్రీలంక బౌలర్లలో కసున్ రజిత రెండు, మహేశ్ తీక్షణ, ధనంజయ డిసిల్వా, లాహిరు కుమార తలో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్ లో శ్రీలంక గెలవాలంటే 20 ఓవర్లలో 168 పరుగులు చేయాలి.


More Telugu News