తెనాలిలో ‘అప్పూ’ భారీ విగ్రహం తయారీ.. బెంగళూరులో ఆవిష్కరణ!

  • పునీత్ రాజ్ కుమార్ చనిపోయి నేటికి ఏడాది
  • ఫైబర్ గ్లాస్ తో 21 అడుగుల విగ్రహం
  • తయారు చేసిన తెనాలి శిల్పులు
  • త్రీడీ సాంకేతికత సాయంతో సిద్ధం చేసినట్లు వెల్లడి
కన్నడ నటుడు పునీత్ రాజ్ కుమార్ మరణించి శనివారానికి సరిగ్గా ఏడాది గడిచిపోయింది. పునీత్ ను అప్పూ అంటూ పిలుచుకునే అభిమానులు మాత్రం ఇప్పటికీ ఆయన మరణించారనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. సినిమాలు, సామాజిక సేవలతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న అప్పూ.. గతేడాది గుండెపోటుకు గురై ఈ లోకాన్ని వీడారు.

శనివారం అప్పూ మొదటి వర్థంతి సందర్భంగా బెంగళూరులో భారీ విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 21 అడుగుల ఫైబర్ గ్లాస్ విగ్రహం తెనాలిలోనే రూపుదిద్దుకుంది. ప్రస్తుతం తుదిమెరుగులు దిద్దుకుంటున్న ఈ విగ్రహం స్థానికులను విశేషంగా ఆకర్షిస్తోంది. అప్పూ అభిమానుల మనసు చూరగొంటోంది. ఈ విగ్రహాన్ని గుంటూరు జిల్లా తెనాలికి చెందిన శిల్పులు కాటూరి వెంకటేశ్వరరావు, రవిచంద్ర, శ్రీహర్ష కలిసి తయారుచేశారు. దీనిని రూపొందించేందుకు 3డీ టెక్నాలజీని ఉపయోగించినట్లు వారు వెల్లడించారు.

ఈ విగ్రహం తయారీకి దాదాపు నాలుగు నెలలు పట్టిందని శిల్పులలో ఒకరైన వెంకటేశ్వరరావు మీడియాకు వివరించారు. ప్రస్తుతం తెనాలిలోని సూర్య శిల్పశాల వద్ద ఈ విగ్రహాన్ని ప్రదర్శనగా ఉంచారు. పునీత్ రాజ్ కుమార్ కు ప్రతిష్ఠాత్మక కర్ణాటక రత్న పురస్కారాన్ని ప్రకటించిన కర్ణాటక ప్రభుత్వం .. నవంబర్ 1న ఆయన కుటుంబ సభ్యులకు పురస్కారం అందజేయనుంది. ఈ కార్యక్రమంలో పునీత్ ఫైబర్ విగ్రహాన్ని ప్రదర్శించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కార్యక్రమంలో తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ తో పాటు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథులుగా పాల్గొంటారని సమాచారం.


More Telugu News