భారత్ జోడో యాత్రలో.. రాహుల్ ‘కోయ కొమ్ము డ్యాన్స్’ 

  • కోయ గిరిజన మహిళలతో రాహుల్ నృత్యం
  • యువనేతతో ఫొటోలు దిగేందుకు యువతుల్లో ఉత్సాహం
  • వీరి కళలను కాపాడుకోవాలంటూ రాహుల్ ట్వీట్
  • తెలంగాణలో నాలుగోరోజుకు పాదయాత్ర
కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల్లో ఒకరైన రాహుల్ గాంధీ కోయ గిరిజన తెగ ప్రజలతో మమేకం అయ్యారు. శనివారం మహబూబ్ నగర్ పట్టణం పరిధిలోని ధర్మాపూర్ నుంచి భారత్ జోడో యాత్ర (తెలంగాణలో నాలుగో రోజు) తిరిగి మొదలైంది. ఈ రోజు 20 కిలోమీటర్ల పొడవునా ఆయన పాదయాత్ర కొనసాగనుంది. 

ఈ సందర్భంగా కోయ గిరిజన తెగకు చెందిన యువతులు, మహిళలతో కలసి రాహుల్ గాంధీ కొమ్ము నృత్యంలో పాల్గొన్నారు. రాహుల్ నెత్తిన కొమ్ముల కిరీటాన్ని వారు ధరింపజేశారు. దాంతో చాలా స్వల్ప సమయం పాటు స్టెప్స్ వేసిన రాహుల్ తర్వాత, కొమ్ముల తలపాగా తీసివేసి మామూలుగా వారితో కలసి నృత్యమాడారు. గిరిజన యువతులంతా రాహుల్ చుట్టూ చేరి చిరునవ్వులు చిందిస్తూ ఫొటోలు దిగారు. 

‘‘గిరిజనులు మన ప్రాచీన సంస్కృతి, వైవిధ్యానికి చెందిన భాండాగారాలు. కొమ్ము కోయ గిరిజన డ్యాన్సర్లతో పాదం కలపడాన్ని ఆస్వాదించాను. వారి కళ వారి విలువలను చాటి చెబుతోంది. దీన్ని మనం తప్పకుండా తెలుసుకోవడమే కాకుండా కాపాడుకోవాలి’’ అంటూ రాహుల్ తన ట్విట్టర్ హ్యాండిల్ పై వీడియో, ట్వీట్ పోస్ట్ చేశారు. ఇక నేటి పాదయాత్ర ముగిస్తూ సాయంత్రం జడ్చెర్ల క్రాస్ రోడ్డు వద్ద బహిరంగ సభలో రాహుల్ మాట్లాడనున్నారు.


More Telugu News