పక్షవాతం ముప్పును ఇలా గుర్తించొచ్చు!

  • ‘స్ట్రోక్’పై జనంలో అవగాహన తక్కువేనంటున్న వైద్యులు
  • తొందరగా గుర్తిస్తే నష్ట తీవ్రతను తగ్గించొచ్చని సూచన
  • ఏటా అక్టోబర్ 29న బ్రెయిన్ స్ట్రోక్ అవగాహన దినం
బ్రెయిన్ స్ట్రోక్.. అంటే పక్షవాతం అన్నది ఈ రోజుల్లో హార్ట్ ఎటాక్ లా సాధారణం అయిపోతోంది. అయితే, దీని గురించి ప్రజలలో అవగాహన తక్కువ. పక్షవాతానికి గురైనప్పటికీ దానిని సకాలంలో గుర్తించలేకపోతున్నారు. కాళ్లు, చేతులు పడిపోయాక మాత్రమే ఆసుపత్రికి వెళుతున్నారు. కానీ పక్షవాతం బారిన పడినపుడు ఎంత తొందరగా వైద్యులను ఆశ్రయిస్తే అంత మేలు. పక్షవాతం వల్ల శరీర అవయవాలకు కలిగే నష్టాల తీవ్రతను తగ్గించవచ్చని వైద్యులు చెబుతున్నారు. 

ఇక స్ట్రోక్ లక్షణాలను గుర్తించడానికి, వైద్యం అందడానికి మధ్య కాలాన్ని వైద్యులు ‘గోల్డెన్ పీరియడ్’ అని వ్యవహరిస్తున్నారు. ఈ పీరియడ్ వ్యవధి నాలుగున్నర గంటలని చెబుతున్నారు. పక్షవాతంపై ప్రజలలో అవగాహన పెంచేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏటా అక్టోబర్ 29న బ్రెయిన్ స్ట్రోక్ అవగాహన దినం నిర్వహిస్తోంది.

లక్షణాలు..
కళ్లు తిరగటం, కంటిచూపు తాత్కాలికంగా మందగించడం, లేదా రెండుగా కనిపించడం, కాళ్లు, చేతులు ఉన్నట్లుండి బలహీనంగా అవడం, మాటలు తడబడడం వంటి లక్షణాలు కనిపిస్తాయని వైద్యులు వెల్లడించారు.

కారణాలు..
బీపీ, మధుమేహం (షుగర్), మద్యపానం, ధూమపానం అలవాట్లతో పాటు స్థూలకాయం కారణంగా శరీరంలో కొలెస్ట్రాల్ పెరగడం, గుండె జబ్బులకు మందులు సరిగా వాడకపోవడం తదితర కారణాలు.

పక్షవాతం బారిన పడితే ఏం జరుగుతుంది..
రక్తసరఫరాలో అంతరాయం వల్ల మెదడు పనితీరు మందగించి పక్షవాతం వస్తుంది. బాధితుల్లో 85 శాతం మందికి కాళ్లు, చేతులు పడిపోవడం, మూతి వంకర పోవడం, మాటల్లో స్పష్టత లేకపోవడం, కంటిచూపు కూడా పోవచ్చు. మిగతా 15 శాతం మందిలో మెదడులో నరాలు చిట్లిపోయి అంతర్గత రక్తస్రావం జరుగుతుంది.


More Telugu News