స్టాలిన్ మౌనంగా ఉంటే అర్థం ఏంటి?: ఖుష్బూ

  • బీజేపీలో ఉన్న నటీమణులపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన డీఎంకే నేత సైదాయ్ సిద్ధికి
  • ఖుష్బూ, నమిత, గౌతమి, గాయత్రిలను ఉద్దేశించి  వ్యాఖ్య
  • రాజకీయాల్లోకి వచ్చిన 'ఐటెంలు' అంటూ ఎద్దేవా 
సినీ తారలు ఖుష్బూ, గౌతమి, నమిత, గాయత్రి రఘురామ్ లు బీజేపీలో కొనసాగుతుండడం తెలిసిందే. డీఎంకే నేత సైదాయ్ సిద్ధికి ఈ నలుగురిని ఉద్దేశించి 'రాజకీయాల్లోకి వచ్చిన ఐటెంలు' అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల పట్ల డీఎంకే పార్టీలోనే వ్యతిరేకత వ్యక్తమైంది. తమ పార్టీ నేత చేసిన వ్యాఖ్యలకు ఎంపీ కనిమొళి క్షమాపణలు చెప్పారు. 

అయితే, దీనిపై బీజేపీ నేత ఖుష్బూ ఇంకా ఆగ్రహంతోనే ఉన్నారు. డీఎంకే నేత వ్యాఖ్యల పట్ల సీఎం స్టాలిన్ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. స్టాలిన్ స్పందించకుండా ఉంటే అర్థం ఏంటి? ఆయన మౌనం దేనికి సంకేతం? అని ఆమె ప్రశ్నించారు. 

"ఈ విషయంలో సీఎం స్టాలిన్ నాకు మద్దతుగా నిలుస్తారని ఆశిస్తున్నాను. కానీ ఆయన ఎందుకు మాట్లాడడంలేదు?" అని నిలదీశారు. అంతేకాదు, అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆ డీఎంకే నేతను వదిలేది లేదని, ఎక్కడికి వెళ్లాలో అక్కడికే వెళతానని హెచ్చరించారు. సైదాయ్ సిద్ధికిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్టు సంకేతాలు ఇచ్చారు. ఇది తన ఆత్మగౌరవం, మర్యాదలు సంబంధించిన విషయం అని ఖుష్బూ స్పష్టం చేశారు.

అటు, ఐటెంలు అంటూ వ్యాఖ్యానించిన డీఎంకే నేత సైదాయ్ సిద్ధికి క్షమాపణలు తెలిపారు. ఎవరి మనోభావాలూ గాయపర్చాలని తాను వ్యాఖ్యలు చేయలేదని వివరణ ఇచ్చారు. అయితే, బీజేపీ నాయకత్వం చేస్తున్న వ్యాఖ్యల పట్ల ఎవరూ ఎందుకు స్పందించరని సిద్ధికి ప్రశ్నించారు.


More Telugu News