ఎలాన్ మస్క్ కు అభినందనలు తెలుపుతూ.. ఫిర్యాదు కూడా చేసిన రాహుల్ గాంధీ

  • ట్విట్టర్ ను కొనుగోలు చేసిన టెస్లా అధినేత ఎలాన్ మస్క్
  • ట్విట్టర్ వేదికగానే మస్క్ కు గ్రీటింగ్స్ చెప్పిన రాహుల్ గాంధీ
  • తన ఫాలోయర్లను ట్విట్టర్ తిరస్కరించిన వైనంపై ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నేత
  • సాక్ష్యంగా తన ఫాలోయర్ల గ్రాఫ్ ను ట్వీట్ కు జత చేసిన వైనం
సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ ను కొనుగోలు చేసిన టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అభినందనలు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం ట్విట్టర్ వేదికగానే ఆయన మస్క్ కు గ్రీటింగ్స్ తెలిపారు. గ్రీటింగ్స్ తో పాటు ట్విట్టర్ కొత్త అధినేతగా మారిన మస్క్ కు రాహుల్ గాంధీ ఓ ఫిర్యాదు కూడా చేశారు. ప్రభుత్వ ఒత్తిడితో విపక్షాల గొంతు నొక్కే సంప్రదాయానికి ట్విట్టర్ ఇకనైనా తెరదించుతుందని భావిస్తున్నానని రాహుల్ అన్నారు. విద్వేష ప్రసంగాలను అడ్డుకోవడంతో పాటుగా నిజ నిర్ధారణ మరింత పకడ్బందీగా జరిగేలా చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నానని రాహుల్ తెలిపారు.

ఈ సందర్భంగా తన ట్విట్టర్ ఖాతాలో ఇటీవల చోటుచేసుకున్న మార్పులకు సంబంధించిన ఓ గ్రాఫ్ ను ఎలాన్ మస్క్ కు పంపిన ట్వీట్ కు రాహుల్ గాంధీ జత చేశారు. ఈ గ్రాఫ్ లో రాహుల్ గాంధీ ఫాలోయర్ల సంఖ్య క్రమంగా పెరుగుతూ వచ్చింది. అయితే కొంత కాలం పాటు రాహుల్ ఖాతాకు కొత్తగా వచ్చిన ఫాలోయర్లను ట్విట్టర్ తిరస్కరించింది. ఫలితంగా కొంతకాలం పాటు రాహుల్ గాంధీ ట్విట్టర్ ఫాలోయర్ల సంఖ్యలో ఎలాంటి మార్పులు రాలేదు. ఆ తర్వాత తిరిగి రాహుల్ గాంధీ ఫాలోయర్ల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఇదే గ్రాఫ్ ను తన ట్వీట్ కు జత చేసిన రాహుల్... ప్రభుత్వ ఒత్తిడి వల్లనే తన ఫాలోయర్లను ట్విట్టర్ అనుమతించకపోయి ఉండవచ్చన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. 


More Telugu News