ప్లాస్టిక్ బాటిళ్లను రీసైకిల్ చేసి ఇయర్ బడ్స్ రూపొందించిన సోనీ

  • లింక్ బడ్స్ సిరీస్ లో కొత్త ఇయర్ బడ్స్
  • పర్యావరణ హిత ఇయర్ బడ్స్ తీసుకువచ్చిన సోనీ
  • నవంబరు నుంచి ఎంపిక చేసిన దేశాల్లో అమ్మకాలు
ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోతూ, భూమిలో ప్రమాదకర పదార్థాల శాతం పెరిగిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. జపాన్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం సోనీ ఈ దిశగా కీలక కార్యాచరణ చేపట్టింది. ప్రపంచ పర్యావరణ హితం కోరి రోడ్ టు జీరో పేరిట ప్రత్యేక కార్యాచరణ ప్రారంభించింది. 

అందులో భాగంగా, ప్లాస్టిక్ సీసాలను రీసైకిల్ చేసి వాటితో ఇయర్ బడ్స్ రూపొందిస్తోంది. తద్వారా మెరుగైన పర్యావరణం కోసం తన వంతు సహకారం అందిస్తోంది. ఇక ఈ రీసైకిల్ ప్లాస్టిక్ తో తయారుచేసిన ఇయర్ బడ్స్ కు 'లింక్ బడ్స్ ఎస్ ఎర్త్ బ్లూ టీడబ్ల్యూఎస్' అని నామకరణం చేశారు. వీటిని నవంబరు మాసంలో ఆసియా ఖండంలో కొన్ని దేశాల్లో విడుదల చేయనున్నారు. 

దీనిపై సోనీ సంస్థ స్పందిస్తూ, లింక్ బడ్స్ సిరీస్ లో ఇవి కొత్త ఇయర్ ఫోన్స్ అని వెల్లడించింది. ఎర్త్ బ్లూ కలర్ లో వస్తున్నట్టు తెలిపింది. ప్రపంచ పర్యావరణం కోసం తాము రూ.4 కోట్ల విరాళం ఇస్తున్నట్టు పేర్కొంది. 

కాగా, ఈ నూతన లింక్ బడ్స్ లో మల్టీపాయింట్ కనెక్టివిటీ ఏర్పాటు చేశారు. ఇది రెండు డివైస్ లతో కనెక్ట్ కాగలదు. చుట్టూ ఉన్న పరిసరాలకు అనుగుణంగా శబ్ద నాణ్యతను మార్చుకునేలా అడాప్టివ్ సౌండ్ కంట్రోల్ టెక్నాలజీని ఈ సోనీ లేటెస్ట్ ఇయర్ బడ్స్ లో వినియోగించారు. ఈ ఫోన్లను ప్లాస్టిక్ రహిత బాక్సులో ఉంచి విక్రయించనున్నారు.


More Telugu News