ఈడీ ఆఫీస్ కు వెళ్లిన రఘునందన్ రావు... ప్రచారంలో వున్న ఆడియోపై విచారణ కోరిన బీజేపీ ఎమ్మెల్యే

  • తెలంగాణలో హాట్ టాపిక్ గా ఎమ్మెల్యేల కొనుగోలు అంశం
  • రోహిత్ రెడ్డితో నిందితులు మాట్లాడినదిగా భావిస్తున్న ఓ ఆడియో విడుదల
  •  తగిన చర్యలు చేబడతామన్న ఈడీ అధికారులు 
టీఆర్ఎస్ కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు జరిగిన యత్నం తమది కాదంటూ బీజేపీ వాదిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ వ్యవహారంపై సిట్ తో దర్యాప్తు చేయించాలని కోరుతూ బీజేపీ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా శుక్రవారం మధ్యాహ్నం యాదాద్రి వెళ్లిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్... ఆ డీల్ తమది కాదంటూ ఆలయంలో ప్రమాణం చేశారు. ఈ ఘటనకు కాస్తంత ముందుగా బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు నేరుగా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయానికి వెళ్లారు.

ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు జరిగిన యత్నంలో భాగంగా నిందితులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిల మధ్య జరిగిన సంభాషణ అంటూ శుక్రవారం ఓ ఆడియో బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఆడియో వ్యవహారంపై విచారణ చేపట్టాలని రఘునందన్ రావు ఈడీ అధికారులను కోరారు. ఈ మేరకు ఆయన ఈడీ కార్యాలయంలో ఓ వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ వినతిని స్వీకరించిన ఈడీ అధికారులు తగిన రీతిలో చర్యలు చేపడతామని చెప్పినట్లు రఘునందన్ రావు తెలిపారు.


More Telugu News