నక్సలిజం అంతు చూడాల్సిందే: మోదీ

  • నక్సల్స్ యువతను పక్కదోవ పట్టిస్తారన్న ప్రధాని
  • దేశ వ్యాప్తంగా పోలీసులకు ఒకే రకమైన యూనిఫాం ఉంటే బాగుంటుందని సూచన
  • సోషల్ మీడియాను తక్కువగా అంచనా వేయొద్దని హెచ్చరిక
దేశంలో నక్సలిజం ఏ రూపంలో ఉన్నా దాని అంతు చూడాల్సిందేనని ప్రధాని మోదీ అన్నారు. నక్సల్స్ గన్నులు పట్టుకోగలరు, పెన్నులు పట్టుకోగలరని... యువతను పక్కదోవ పట్టించగలరని చెప్పారు. రాష్ట్రాల హోంమంత్రులు, డీజీపీలతో నిర్వహించిన చింతన్ శిబిరంలో ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. యువత భావోద్వేగాలను వాడుకుని దేశ సమైక్యతను దెబ్బ తీసేందుకు యత్నించేవారిని ఓడించేందుకు మన బలగాలు మేధోశక్తిని పెంచుకోవాలని చెప్పారు. 

దేశ వ్యాప్తంగా పోలీసులకు ఒకే రకమైన యూనిఫాం ఉంటే బాగుంటుందని మోదీ అన్నారు. దేశ వ్యాప్తంగా పోస్ట్ బాక్స్ ను ఎలా గుర్తు పట్టగలమో... అదే విధంగా పోలీస్ యూనిఫాంను కూడా గుర్తించగలిగేలా ఉండాలన్నారు. పోలీస్ స్టేషన్లను బహుళ అంతస్తుల్లో నిర్మించాలని సూచించారు. కింద అంతస్తులో పోలీస్ స్టేషన్ ను నిర్వహించాలని... పై అంతస్తుల్లో పోలీసుల నివాస సముదాయాలు ఉండేలా చూసుకోవాలని చెప్పారు. అప్పుడు పోలీసులు నగరాలకు దూరంగా ఉండటం తగ్గుతుందని తెలిపారు. పాత వాహనాలను పోలీసులు ఉపయోగించకూడదని... ప్రభుత్వ తుక్కు విధానం ప్రకారం పాత వాహనాల వినియోగానికి దూరంగా ఉండాలని చెప్పారు. 

సోషల్ మీడియాను తక్కువగా అంచనా వేయొద్దని... తప్పుడు వార్తలతో ప్రజలను గందరగోళానికి గురి చేసే శక్తి సోషల్ మీడియాకు ఉందని అన్నారు. ఏదైనా సమాచారాన్ని ఫార్వర్డ్ చేసే ముందు పది సార్లు చూసుకోవాలని చెప్పారు.


More Telugu News