డబ్బు కోసం కాదు.. నేను ప్రేమించే మానవాళి మంచి కోసమే ట్విట్టర్ కొన్నా: ఎలాన్ మస్క్

  • ట్విట్టర్ కొనుగోలుపై సుదీర్ఘ వివరణ ఇచ్చిన ఎలాన్ మస్క్
  • ప్రకనటదారులను ఉద్దేశిస్తూ ప్రకటన విడుదల 
  • ట్విట్టర్ కొనుగోలుపై అనేక ఊహాగానాలు వినిపించాయని వ్యాఖ్య 
  • వాటిలో ఎంతమాత్రం వాస్తవం లేదన్న టెస్లా అధినేత
టెస్లా అధినేత ఎలాన్ మస్క్ సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ ను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ట్విట్టర్ ను ఆయన ఎందుకు కొన్నారన్న విషయంపై ఇప్పటికే పెద్ద ఎత్తున చర్చలు జరగగా... అసలు తాను ట్విట్టర్ ను ఎందుకు కొనుగోలు చేశానన్న విషయాన్ని మస్క్ తాజాగా వెల్లడించారు. తానేమీ డబ్బు కోసం ట్విట్టర్ ను కొనుగోలు చేయలేదని ఆయన తేల్చి చెప్పారు. తాను ప్రేమించే మానవాళి మంచి కోసమే ట్విట్టర్ ను కొన్నానని మస్క్ తన ప్రకటనలో పేర్కొన్నారు. ఈ మేరకు ప్రకటనదారులను ఉద్దేశించి మస్క్ గురువారం ఓ సుదీర్ఘ ప్రకటనను విడుదల చేశారు.

''ట్విట్టర్ ను కొనాలనే నిర్ణయం వెనకున్న నా ఉద్దేశాన్ని మీకు తెలియజేయాలనుకుంటున్నాను. ట్విట్టర్ ను నేను ఎందుకు కొంటున్నాను అన్న దానిపైనా, ప్రకటనలపైనా నా ఉద్దేశానికి సంబంధించి అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వాటిలో ఏమాత్రం నిజం లేదు. రాబోయే తరానికి ఓ ఉమ్మడి డిజిటల్ వేదిక ఉండటం చాలా ముఖ్యం. ఆరోగ్యకరమైన వాతావరణంలో అనేక అంశాలపై చర్చించుకునేలా అది ఉండాలి. హింసకు తావుండొద్దు. ప్రస్తుతం ఉన్న సామాజిక మాధ్యమాలు రెండు భిన్న ధ్రువాలుగా విడిపోయి విద్వేషం, విభజనను ప్రోత్సహించేలా మారే ప్రమాదం ఉంది. దీంతో చర్చకు అవకాశం లేకుండా పోతోంది. 

అందుకోసమే నేను ట్విట్టర్ ను కొనుగోలు చేశాను. డబ్బు కోసం కాదు. నేను ప్రేమించే మానవాళికి సాయం చేయడానికి కొన్నాను. ఎలాంటి పరిణామాలు ఎదుర్కోకుండా ఏదైనా చెప్పడానికి అందరికీ ట్విట్టర్ ఉచిత వేదిక కాబోదు. నిబంధనలు, చట్టాలకు కట్టుబడి ఉంటూనే అందరికీ అందుబాటులో ఉండాలి. అన్ని వర్గాలకు నచ్చిన ఎంపికలు అందించేలా తీర్చిదిద్దాలి" అని మస్క్ పేర్కొన్నారు.


More Telugu News