పిల్లలను విచారించాల్సిన అవసరం ఏమిటి?.. సీఐడీ అధికారులను నిలదీసిన ఏపీ హైకోర్టు

  • ఇటీవలే చింతకాయల విజయ్ కు నోటీసులు జారీ చేసిన సీఐడీ
  • విజయ్ లేకపోవడంతో ఆయన పిల్లలను విచారించిన పోలీసులు
  • సీఐడీ తీరుపై హైకోర్టుకు ఫిర్యాదు చేసిన విజయ్
  • విజయ్ ను ఎందుకు వేధిస్తున్నారని సీఐడీని ప్రశ్నించిన కోర్టు
  • పొంతన లేని అంశాలు చెబుతున్నారంటూ మండిపాటు
ఏపీ సీఐడీ అధికారుల తీరుపై హైకోర్టు గురువారం మరోమారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కేసుల్లో నోటీసులు ఇచ్చేందుకు నిందితుల ఇళ్లకు వెళ్లి... నిందితులు లేకపోతే వారి పిల్లలను ప్రశ్నించడం ఎంతవరకు సమంజసమని సీఐడీ అధికారులను హైకోర్టు నిలదీసింది. పదే పదే నిందితుల ఇళ్లకు వెళ్లడం, వారిని ఇబ్బందులకు గురి చేయడం సరికాదని కూడా సీఐడీ అధికారులకు హైకోర్టు హెచ్చరించింది. ఈ తరహా వైఖరి అనర్ధాలకు దారి తీస్తుందని కూడా సూచించింది.

టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ పై ఏపీ సీఐడీ పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో విచారణకు రావాలంటూ ఆయనకు నోటీసులు జారీ చేసేందుకు ఇటీవలే సీఐడీ పోలీసులు హైదరాబాద్ లోని విజయ్ ఇంటికి వెళ్లారు. అయితే, ఆ సమయంలో విజయ్ ఇంటిలో లేకపోవడంతో పిల్లలను విచారించారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన విజయ్ సీఐడీ అధికారులపై హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై గురువారం జరిగిన విచారణ సందర్భంగా హైకోర్టు పై వ్యాఖ్యలు చేసింది. 

విజయ్ కు జారీ చేసిన నోటీసుల్లో పేర్కొన్న అంశాలకు, కోర్టుకు చెబుతున్న అంశాలకు అసలు పొంతనే లేదని కూడా హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఈ కేసులో విజయ్ ఇంటికి పదే పదే వెళ్లడం కూడా సరికాదని కోకర్టు అభిప్రాయపడింది. పదే పదే విజయ్ కుటుంబాన్ని ఎందుకు వేధిస్తున్నారని కూడా కోర్టు సీఐడీ అధికారులను నిలదీసింది.


More Telugu News