ప్రైవేటు ఫొటోలు లీకైతే.. వెంటనే చేయాల్సిన పనులివే..

  • ఇతరుల వ్యక్తిగత వీడియోలను లీక్ చేయడం నేరం
  • ఐపీసీ సెక్షన్ 354 సీ, ఐటీ చట్టం కింద కేసు పెట్టొచ్చు
  • ఐదేళ్ల జైలుశిక్షతో పాటు జరిమానా కూడా..
జీవిత భాగస్వామితోనో, ప్రేమించినవారితోనో సన్నిహితంగా ఉన్న ఫొటోలు, వీడియోలు ఇంటర్నెట్ లో లీకయితే.. సోషల్ మీడియాలో పెట్టుకున్న ఫొటోలను దొంగిలించి, మార్ఫింగ్ చేసి వైరల్ చేస్తే.. వైరల్ చేస్తామని బెదిరిస్తూ పెద్ద మొత్తంలో డబ్బులు డిమాండ్ చేస్తే.. ఇలాంటి పరిస్థితి ఎదురయితే కలిగే మానసిక వేదన అంతాఇంతా కాదు. అవమానం తట్టుకోలేక కొంతమంది ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు. ఇటీవల లోన్ యాప్ వ్యవహారాల్లో ఇలాంటి బెదిరింపులు ఎక్కువయ్యాయి. ఈనేపథ్యంలో వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు లీక్ అయితే ఏం చేయాలో తెలుసుకుందాం. 

వీడియో లేదా ఫొటోలు లీక్ అయ్యాయని తెలిసిన వెంటనే దగ్గర్లోని పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయాలి. సైబర్ క్రైమ్ పోలీసులకూ కంప్లైంట్ ఇవ్వాలి. లేదా ఆన్ లైన్ లో  https://cybercrime.gov.in వెబ్ సైట్ లోనూ ఫిర్యాదు చేయొచ్చు. లీక్ అయిన ఫొటో/వీడియోలకు సంబంధించిన స్క్రీన్ షాట్, అది సైటులో ఉందనే విషయాన్ని జాగ్రత్తగా సేవ్ చేయాలి. ఆ సైటు యూఆర్ఎల్ ను కాపీ చేసి ఆ వివరాలను సైబర్ పోలీసులకు అందజేయాలి. ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రాం తదితర సోషల్ మీడియాలో ప్రచారానికి సంబంధించిన వివరాలనూ వెల్లడించాలి. సదరు ఫొటోలు, వీడియోల గురించి  ఎంత ఎక్కువ సమాచారం ఉంటే నిందితులను పట్టుకోవడానికి అవకాశాలు అంత ఎక్కువగా ఉంటాయని పోలీసులు చెబుతున్నారు.

తీవ్రమైన నేరం..
ఇతరుల వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివరాలను సోషల్ మీడియాలో పోస్టు చేయడం తీవ్రమైన నేరమేనని పోలీసులు హెచ్చరిస్తున్నారు. వ్యక్తిగత వీడియోలను వైరల్ చేసిన వాళ్లపై కఠిన చర్యలు తీసుకునేలా నిబంధనలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలకు పాల్పడిన వారిపై ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 354సీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం కింద కేసు నమోదు చేయొచ్చన్నారు. నేరం రుజువైతే ఐదేళ్ల వరకు జైలుశిక్ష పడుతుందని, జరిమానా కూడా పడొచ్చని వివరించారు.


More Telugu News