కరెన్సీ నోట్లపై అల్లా, ఏసు బొమ్మలు వేయాలి: కాంగ్రెస్ నేత
- లక్ష్మీ, గణేశుడి బొమ్మలు వేయాలన్న కేజ్రీవాల్
- అల్లా, ఏసు, బుద్ధుడి బొమ్మలతో మరింత ఐశ్వర్యం వస్తుందంటూ కాంగ్రెస్ నేత సల్మాన్ అనీస్ సోజ్ వ్యంగ్యం
కరెన్సీ నోట్లపై బొమ్మల అంశం దేశవ్యాప్తంగా ఇప్పుడు పెద్ద చర్చనీయాంశం అయింది. ఇటీవలే అఖిల భారత హిందూ మహాసభ కోల్ కతా విభాగం కరెన్సీ నోట్లపై గాంధీజీ స్థానంలో, స్వాతంత్య్రం కోసం పోరాడిన నేతాజీ బొమ్మకు చోటివ్వాలని డిమాండ్ చేయగా.. కొన్ని రోజుల విరామంతో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ దీన్ని మరింత వివాదంగా మార్చే వ్యాఖ్యలు చేశారు.
కరెన్సీ నోట్లపై ఒకవైపు గాంధీ బొమ్మను ఉంచి, మరోవైపు లక్ష్మీదేవి, గణేశుడి ప్రతిరూపాలను వేయాలని కేంద్రంలోని బీజేపీ సర్కారును కోరారు. మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా దైవానుగ్రహం లేకపోతే దేశం అభివృద్ధి సాధ్యం కాదంటూ ఆయన ఈ సూచన చేశారు. నిజానికి ఈ అంశాన్ని అడ్డుపెట్టుకుని బీజేపీని ఇరుకున పెట్టాలన్నది కేజ్రీవాల్ వ్యూహం. దీనికి బీజేపీ దీటుగానే బదులిచ్చింది.
కాంగ్రెస్ నేత సల్మాన్ అనీస్ సోజ్ ఈ అంశాన్ని మరింత ముందుకు తీసుకెళుతూ.. ‘‘లక్ష్మీ, గణేశుడు ఐశ్వర్యాన్ని తీసుకొచ్చేట్టు అయితే.. అల్లా, జీసస్, బుద్ధ, గురునానక్, మహావీర బొమ్మలను జోడించడం ద్వారా మరింత ఐశ్వర్యాన్ని తీసుకొస్తారు’’అని ఆయన ట్విట్టర్ లో ట్వీట్లు పెట్టారు. దీనికి ట్విట్టర్ యూజర్లు గట్టిగానే స్పందిస్తున్నారు. దీని వెనుక లాజిక్ ఏంటో చెప్పాలని కోరుతున్నారు.