ఐసీసీపై భారత్​ అసహనం.. మొన్న ఆహారం, నిన్న ప్రాక్టీస్ బాయ్ కాట్ చేసిన ఆటగాళ్లు

  • సిడ్నీ గ్రౌండ్ కు 42 కి.మీ. దూరంలో హోటల్ కేటాయింపు
  • అంతదూరం ప్రయాణించి ప్రాక్టీస్ చేసేందుకు ఇష్టపడని జట్టు
  • ఈ మధ్యాహ్నం నెదర్లాండ్స్ తో భారత్ మ్యాచ్
టీ20 ప్రపంచ కప్ కోసం ఆస్ట్రేలియాలో ఉన్న టీమిండియా, బీసీసీఐ అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయి. తమ ఆటగాళ్లకు వసతి, భోజన ఏర్పాట్ల విషయంలో ఐసీసీపై అసంతృప్తి వ్యక్తం చేశాయి. మొన్న ప్రాక్టీస్ సమయంలో ఐసీసీ ఇచ్చిన చల్లటి ఆహారాన్ని బాయ్ కాట్ చేసిన భారత జట్టు బుధవారం సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ లో తమ ప్రాక్టీస్ సెషన్ ను బాయ్ కాట్ చేసింది. గురువారం నెదర్లాండ్స్ తో మ్యాచ్ కు ముందు  ప్రాక్టీస్ సెషన్ లో పాల్గొనకూడదని నిర్ణయించింది. 
 
మెల్ బోర్న్ లో పాకిస్థాన్ పై ఘన విజయం తర్వాత నెదర్లాండ్స్ తో మ్యాచ్ కోసం సిడ్నీ చేరుకున్న భారత జట్టు కు ఐసీసీ సిడ్నీ శివార్లలోని బ్లాక్ టౌన్ లో హోటల్ లో బస ఏర్పాటు చేసింది. ఇది సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ కు 42 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇంత దూరం హోటల్ కేటాయించడంపై అసహనం వ్యక్తం చేసిన ఆటగాళ్లు ప్రాక్టీస్ ను బాయ్ కాట్ చేశారు. అంతకుముందు మంగళవారం ప్రాక్టీస్ సమయంలో ఐసీసీ అందించిన చల్లటి, నాణ్యత లేని ఆహారంపై కూడా అసహనం వ్యక్తం చేశారు. ఆ ఆహారం తినకుండా హోటల్ చేరుకొని భోజనం చేశారు. దాంతో, ఐసీసీ తీరుపై అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తున్నాయి.

కాగా, టీ20 ప్రపంచ కప్ సూపర్ 12లో భాగంగా భారత జట్టు ఈ మధ్యాహ్నం నెదర్లాండ్స్ తో సిడ్నీలో తలపడనుంది. ఆదివారం జరిగిన తొలి లీగ్ మ్యాచ్‌‌‌‌లో టీమిండియా 4 వికెట్ల తేడాతో పాకిస్థాన్ ‌‌‌ను ఓడించింది.


More Telugu News