తాడేపల్లి వచ్చిన కోడికత్తి కేసు నిందితుడు శ్రీను కుటుంబం... సీఎం జగన్ ను కలిసేందుకు ప్రయత్నం!

  • సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చిన శ్రీను తల్లి సావిత్రి, సోదరుడు సుబ్బరాజు
  • స్పందన కార్యక్రమంలో వినతి పత్రం అందించిన వైనం
  • తన కుమారుడికి బెయిల్ ఇప్పించాలని కోరిన సావిత్రి
  • బెయిల్ లో జాప్యమెందుకో తెలియడం లేదన్న సుబ్బరాజు
  • జగన్ ను కలవలేదన్న సావిత్రి
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై 2019 ఎన్నికలకు ముందు విశాఖ విమానాశ్రయంలో కోడి కత్తితో దాడి చేసిన జనుపల్లి శ్రీనివాసరావు అలియాస్ శ్రీను వ్యవహారంలో బుధవారం ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. 

సీఎం జగన్ ను కలిసేందుకు శ్రీను తల్లి సావిత్రి, సోదరుడు సుబ్బరాజులు బుధవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చారు. ఈ కేసులో విచారణ ఖైదీగా శ్రీను నాలుగేళ్లుగా జైల్లోనే ఉంటున్నాడు. తన కుమారుడికి బెయిల్ ఇచ్చి ఆదుకోవాలని సీఎం జగన్ ను కోరేందుకే తాడేపల్లి వచ్చినట్లు సావిత్రి, సుబ్బరాజులు తెలిపారు. శ్రీనుకు న్యాయవాదిగా వ్యవహరిస్తున్న అలీని వెంటబెట్టుకుని మరీ వారు సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చారు.

శ్రీను కుటుంబ సభ్యులకు సీఎం జగన్ అపాయింట్ మెంట్ ఇచ్చినట్లుగా తొలుత వార్తలు రాగా... ఆ తర్వాత అవి అవాస్తవమని తేలింది. సీఎంను కలిసేందుకే తాడేపల్లి వచ్చిన తాము... ఆయనను కలవలేదని శ్రీను తల్లి సావిత్రి తెలిపారు. 

స్పందనలో వినతి పత్రం అందించిన అనంతరం ఆమె మాట్లాడుతూ, కుమారుడు దూరమైన కారణంగా తాము ఎదుర్కొంటున్న వేదనను మీడియాకు వివరించారు. చేతికొచ్చిన కుమారుడు ఈ కేసులో జైలు పాలు కావడంతో తమ కుటుంబ పోషణ కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని సీఎం జగన్ కు నేరుగా వెల్లడించేందుకు అనుమతి ఇవ్వాలని కోరామని, అయితే అధికారుల నుంచి తమకు అనుమతి లభించలేదన్నారు. ఫలితంగా సీఎం జగన్ ను తాము కలవలేదన్నారు. తన కొడుకును తన వద్దకు చేర్చకపోతే ఆత్మహత్యే శరణ్యమని ఆమె తెలిపారు.

తన కుమారుడు శ్రీనుకు బెయిల్ ఇప్పించుకునేందుకే తాము న్యాయవాదితో కలిసి సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చామని ఆమె తెలిపారు. ఇందులో భాగంగా సీఎం క్యాంపు కార్యాలయంలో జరుగుతున్న స్పందన కార్యాక్రమంలో  వినతి పత్రం సమర్పించామన్నారు.  తన కుమారుడి బెయిల్ కు అభ్యంతరం లేదని లేఖ ఇవ్వాలని సదరు వినతి పత్రంలో అభ్యర్థించామని తెలిపారు.

ఈ సందర్భంగా కోడి కత్తి దాడి ఘటనపైనా ఆమె పలు వ్యాఖ్యలు చేశారు. తమ అబ్బాయి జగన్ పై దాడి చేశాడో, లేదో తనకు తెలియదని సావిత్రి అన్నారు. అయితే జగన్ అంటే తన కుమారుడికి పిచ్చి అభిమానమని వెల్లడించారు. దాడి వ్యవహారంలో తన కుమారుడు బలయ్యాడని ఆమె అన్నారు. బెయిల్ ఇచ్చి తన కుమారుడిని విడిపించాలని జగన్ ను కోరుతున్నానన్నారు. 

శ్రీనుకు బెయిల్ మంజూరులో జాప్యమెందుకో తెలియడం లేదని అతడి సోదరుడు సుబ్బరాజు అన్నారు. ఇప్పటిదాకా బెయిల్ కోసం ఏడు పిటిషన్లు వేసినా అన్నీ తిరస్కరణకు గురయ్యాయని ఆయన తెలిపారు. 



More Telugu News