డిసెంబరులో జగనన్న సాంస్కృతిక సంబరాలు... రాష్ట్రవ్యాప్తంగా పోటీలు

  • ఏపీలో కళల పరిరక్షణకు ప్రభుత్వ సంకల్పం
  • కళాకారులను ప్రోత్సహించాలని నిర్ణయం
  • డిసెంబరు 19, 20 తేదీల్లో పోటీలు
  • దరఖాస్తులకు తుదిగడువు నవంబరు 10
రాష్ట్రంలోని వివిధ కళారూపాలకు మరింత ప్రాచుర్యం కల్పించడం, కళాకారులను ప్రోత్సహించడం తదితర లక్ష్యాలతో ఏపీలో జగనన్న సాంస్కృతిక సంబరాలు పేరుతో పోటీలు నిర్వహించనున్నారు. డిసెంబరు 19, 20 తేదీల్లో ఈ కళా జాతర ఘనంగా జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 

బుర్రకథలు, థింసా నృత్యం, కూచిపూడి, పగటివేషాలు, కొమ్ముకోయ, గరగలు, తప్పెటగుళ్లు వంటి కళలకు సంబంధించి పోటీలు జరపనున్నారు. రెండ్రోజుల పాటు జరిగే ఈ సంప్రదాయ, జానపద, గిరిజన సాంస్కృతిక సంబరాల్లో పాల్గొనే కళాకారులు, కళా బృందాలు దరఖాస్తు చేసుకునేందుకు నవంబరు 10న తుదిగడువుగా నిర్ణయించారు. 

ఈ వెబ్ లింకు (https://culture.ap.gov.in/) ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. లేదా పూర్తిచేసిన దరఖాస్తులను apculturalcompetitions@gmail.com కు పంపవచ్చు. అంతేకాదు, విజయనగరం, రాజమండ్రి, విజయవాడ, కర్నూలు, నెల్లూరు, గుంటూరు ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాలలు, పాఠశాలల్లోనూ, విజయవాడలోని రాష్ట్ర సృజనాత్మకత, సంస్కృతి సమితి కార్యాలయంలోనూ దరఖాస్తులను నేరుగా అందించవచ్చు. 

దీనిపై రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి రోజా మాట్లాడుతూ, ఏపీకి ఎంతో ఘనమైన ప్రాచీన సంస్కృతి ఉందని వెల్లడించారు. ఆ సంస్కృతిని పరిరక్షించుకోవడంతో పాటు భావితరాలకు చాటిచెప్పేలా ప్రభుత్వం కృషి చేస్తుందని, ఈ క్రమంలోనే రాష్ట్రస్థాయిలో సాంస్కృతిక పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు.


More Telugu News