శ్రీకాకుళం జిల్లాలో విష ప్రయోగానికి 40 కోతుల బలి

  • కవిత మండలం శిలగం ప్రాంతంలో వెలుగులోకి
  • కేసు నమోదు చేసిన అటవీ అధికారులు
  • ఐదు రోజుల్లో రానున్న పోస్ట్ మార్టమ్ నివేదిక
శ్రీకాకుళం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. విష ప్రయోగానికి 40 కోతులు ప్రాణాలు కోల్పోయాయి. కవిత మండలం పరిధిలోని శిలగం ప్రాంతంలో ఇది చోటు చేసుకుంది. చెట్ల పొదల్లో కోతులు నిర్జీవంగా పడి ఉండడాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడే మరికొన్ని కోతులు అపస్మారక స్థితిలో ఉన్నట్లు గుర్తించారు. వాటికి ఆహారం అందించినప్పటికీ తినలేని స్థితిలో ఉన్నట్లు స్థానికులు తెలిపారు. 

అటవీ అధికారులు అక్కడికి చేరుకుని వాటిని పోస్ట్ మార్టమ్ కోసం తరలించారు. జంతు సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోస్ట్ మార్టమ్ పూర్తయిందని ఐదు రోజుల్లో నివేదిక వస్తుందని కాశీబుగ్గ అటవీ అధికారి మురళీకృష్ణ తెలిపారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామన్నారు. ‘‘జిల్లాలో ఈ తరహా ఘటనను ఎప్పుడూ చూడలేదు. ఎవరో కానీ ట్రాక్టర్ లో కోతులను తీసుకొచ్చి గ్రామానికి సమీపంలోని అటవీ ప్రాంతంలో పడేసి వెళ్లిపోయారు. సుమారు 40-45 కోతులు మరణించాయి’’అని మురళీకృష్ణ తెలిపారు.


More Telugu News