టీకా తీసుకున్నా కరోనా రావచ్చు.. కనిపించే ఐదు లక్షణాలు ఇవే

  • బ్రిటన్ కు చెందిన జో కోవిడ్ సంస్థ సర్వే
  • దగ్గు, ముక్కు కారటం, ముక్కు మూసుకుపోవడం లక్షణాలు
  • తలనొప్పి, గొంతులో నొప్పి కనిపించొచ్చు
కరోనా టీకా తీసుకున్నా.. ఇప్పటికే కరోనా బారిన పడి కోలుకున్నా.. ఇక మీదట తమకు కరోనా రిస్క్ ఉండదనుకుంటే అది పొరపాటు అవుతుంది. కరోనా టీకా తీసుకున్నా సరే వైరస్ ఇన్ఫెక్షన్ బారిన పడే రిస్క్ పరంగా ఎలాంటి వ్యత్యాసం ఉండదు. కాకపోతే దీని బారిన పడినా, ఇతరులతో పోలిస్తే వీరికి అదనపు రక్షణ ఉంటుందని చెప్పవచ్చు. బ్రిటన్ కు చెందిన జో కోవిడ్ అనే సంస్థ ఇటీవలే ఒక సర్వే నిర్వహించి ఫలితాలు విడుదల చేసింది. కరోనా టీకాలు తీసుకున్న వారు కరోనా వైరస్ కు గురైనప్పుడు ఐదు ప్రధాన లక్షణాలను గుర్తించి వివరాలు వెల్లడించింది.

తీవ్రమైన దగ్గు
విడవకుండా దగ్గు వస్తుంది. ఎక్కువ రోజుల పాటు అదే పనిగా దగ్గు రావడం వల్ల మగతగా అనిపిస్తుంది. అలసటతో రోజువారీ పనులు చేయడం కూడా కష్టంగా మారొచ్చు. హెర్బల్ కాఫ్ సిరప్ లు, అల్లంతో చేసిన టీతో ఉపశమనం లభిస్తుంది.

ముక్కు కారటం
ముక్కు కారడం కూడా కరోనా వైరస్ లో లక్షణమే అని ఈ సర్వే ప్రకటించింది. కరోనా తొలి నాళ్లల్లోనూ ఈ లక్షణం కనిపించిన విషయం తెలిసిందే. టీకాలు తీసుకున్న వారిలోనూ ఇది కనిపిస్తుంది. ఎందుకంటే శ్వాస కోస వ్యవస్థకు సంబంధించి బయటకు కనిపించే తొలి లక్షణం ఇది. 

ముక్కు మూసుకుపోవడం
కరోనాలో ముక్కు మూసుకుపోయే లక్షణం కనిపించొచ్చు. దీంతో శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది ఏర్పడుతుంది. ఈ సమయంలో వేడి నీటి ఆవిరి పట్టడం మంచి చర్య అవుతుంది. నాసల్ స్ప్రేల కంటే కూడా దీంతో మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. 

గొంతు నొప్పి
కరోనా తొలి రెండు విడతల్లో ఎక్కువ మందిలో కనిపించిన లక్షణం ఇది. గొంతు నొప్పి, మంటతో చాలా మంది ఇబ్బంది ఎదుర్కొన్నారు. కరోనా టీకా తీసుకున్న వారిలోనూ ఈ లక్షణం కనిపిస్తుంది. 

తలనొప్పి
గొంతు నొప్పి/మంట, దగ్గు, ముక్కు కారడం, మూసుకుపోవడంలో ఒకటి రెండు లక్షణాలు లేదంటే అన్నింటితోపాటు.. తలనొప్పి కూడా ఉంటే అది కరోనానే అయి ఉండొచ్చు. శ్వాస సరిగ్గా ఆడకపోవడం వల్ల వచ్చే తలనొప్పి ఇది.


More Telugu News