కరెన్సీ నోట్లపై లక్ష్మీదేవి ఫొటో పెట్టండి: కేజ్రీవాల్

  • ఓవైపు గాంధీ, మరోవైపు వినాయకుడి ఫొటో
  • కొత్తనోట్లపై ముద్రించాలని కేజ్రీవాల్ డిమాండ్
  • కేంద్ర ప్రభుత్వానికి ఢిల్లీ ముఖ్యమంత్రి విజ్ఞప్తి
  • ఇండోనేషియా కరెన్సీపై గణేశుడి ఫొటో ఉందని వెల్లడి
కొత్తగా ముద్రించే కరెన్సీ నోట్లపై లక్ష్మీదేవి ఫొటోతో పాటు వినాయకుడి ఫొటోను ముద్రించాలని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేషనల్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. కరెన్సీ నోట్లపై ఒకవైపు మహాత్ముడి ఫొటో, మరోవైపు లక్ష్మీదేవి, వినాయకుడి ఫొటోలను ముద్రించవచ్చని చెప్పారు. ముస్లిం దేశమైన ఇండోనేషియాలో కరెన్సీ నోట్లపై మన గణేషుడి ఫొటో ఉండగా లేనిది మనం మాత్రం మన కరెన్సీపై ఎందుకు ముద్రించకూడదని కేజ్రీవాల్ ప్రశ్నించారు. 

ఈమేరకు బుధవారం ప్రధాని నరేంద్ర మోదీకి ఆయన విజ్ఞప్తి చేశారు. కరెన్సీ నోట్లపై మన దేవతల ఫొటోలు ముద్రించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఒక్కొక్కసారి మనం ఎంత కష్టపడ్డా ఫలితం మాత్రం దక్కదని కేజ్రీవాల్ గుర్తుచేశారు. అలాంటి సమయాల్లో మన శక్తియుక్తులకు దైవానుగ్రహం కూడా తోడైతే ఫలితం దక్కుతుందని ఆయన వివరించారు. ఈ విషయంపై త్వరలోనే ప్రధాని మోదీకి లేఖ రాయనున్నట్లు కేజ్రీవాల్ మీడియాకు వెల్లడించారు.

ఢిల్లీలో త్వరలో జరగబోయే ఎన్నికలకు ఆమ్ ఆద్మీ పార్టీ సిద్ధమైందని కేజ్రీవాల్ వివరించారు. ఢిల్లీలో సివిక్ పోల్స్ తో పాటు గుజరాత్ అసెంబ్లీకి జరగబోయే ఎన్నికలలో సమర్థులైన అభ్యర్థులను నిలబెట్టి గెలిపించుకుంటామని పేర్కొన్నారు. కాగా, దీపావళి సందర్భంగా ఢిల్లీని ముంచెత్తే కాలుష్యం ఈఏడాది తగ్గడంపై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంతోషం వ్యక్తం చేశారు. ఢిల్లీని కాలుష్యరహితంగా తీర్చిదిద్దాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, అందుకోసం ఇలాగే సహకరించాలని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు.


More Telugu News