ఓ ముస్లిం భారత్ లోనే ఎంతో ఎత్తుకు చేరుకోగలడు: ఐఏఎస్ అధికారి ఫైసల్

  • పాక్ వ్యాఖ్యలకు దీటైన బదులు
  • భారత్ లో తాను ఐఏఎస్ అధికారి కాగలిగినట్టు ప్రకటన
  • ప్రపంచంలో మరెక్కడా ముస్లింలకు ఈ స్వేచ్ఛ లేదన్న అభిప్రాయం
భారత సంతతి వ్యక్తి రిషి సునాక్ బ్రిటన్ ప్రధాని పగ్గాలు చేపట్టడంతో.. భారత్ లో ఓ ముస్లిం ప్రధాని కాగలడా? అంటూ పాకిస్థాన్ చేసిన విమర్శలకు.. అచ్చమైన ఓ భారతీయ ముస్లిం, ఐఏఎస్ అధికారి షా ఫైసల్ దీటైన జవాబు ఇచ్చారు. ఓ ముస్లిం భారత్ లోనే ఉన్నత స్థానానికి చేరుకోవడం సాధ్యపడుతుందని ట్విట్టర్లో వరుస ట్వీట్లతో హోరెత్తించారు. తాను భారత్ లోనే అత్యున్నత సర్వీసు అయిన ఐఏఎస్ గా పనిచేస్తున్నానంటూ, ప్రపంచంలో మరెక్కడా ముస్లింలకు ఈ స్థాయి స్వేచ్ఛ లేదని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు.

‘‘ఇది భారత్ లోనే సాధ్యం. కశ్మీర్ కు చెందిన యువకుడు సివిల్ సర్వీస్ ఎగ్జామ్ లో టాప్ గా నిలవగలడు. ప్రభుత్వంలో ఉన్నత స్థాయి అధికారి హోదాకు చేరుకోగలడు. ప్రభుత్వంతో విభేదించి, తిరిగి అదే ప్రభుత్వం ద్వారా రక్షింపబడి, మళ్లీ అదే ప్రభుత్వంతో వెనక్కి తీసుకోబడతాడు. ఇది మన పొరుగు దేశానికి పెద్ద ఆశ్చర్యాన్నిస్తుంది. ఎందుకంటే అక్కడి రాజ్యాంగం ముస్లిమేతరులకు ఉన్నత పదవులు వరించకుండా నిషేధం విధించింది. కానీ, భారత రాజ్యాంగం ఎప్పుడూ కూడా జాతి, ప్రాంతీయత ఆధారంగా వివక్ష చూపదు. 

సమాన పౌరులుగా భారతీయ ముస్లింలు ఊహించలేని స్వేచ్ఛను అనుభవిస్తున్నారు. మౌలానా ఆజాద్ నుంచి డాక్టర్ మన్మోహన్ సింగ్, జాకీర్ హుస్సేన్, ప్రస్తుత ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము వరకు భారత్ అందరికీ సమాన అవకాశాలు ఉన్న దేశం. ఎదిగేందుకు అందరికీ అవకాశాలున్న ప్రాంతం’’అని ఫైసల్ వివరించారు. తన జీవితంలో అన్ని దశల్లోనూ అందరి అభిమానాన్ని పొందానంటూ భారత్ ను కీర్తించారు. 



More Telugu News