ఉన్నపళంగా వెళ్లిపోండి.. ఉక్రెయిన్ లోని భారతీయులకు ఎంబసీ హెచ్చరిక

  • అందుబాటులో ఏ వాహనం ఉంటే అందులో వెళ్లిపోవాలని సూచన
  • ఉక్రెయిన్-రష్యా యుద్ధం మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని వెల్లడి
  • దేశాన్ని వీడేందుకు అవసరమైనోళ్లకు సాయం చేస్తామని హామీ
ఉక్రెయిన్-రష్యా యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్ లో ఉన్న భారతీయులకు అక్కడి ఎంబసీ తాజాగా మరోమారు అడ్వైజరీ జారీ చేసింది. ఉన్నపళంగా ఉక్రెయిన్ ను వీడాలని అందులో సూచించింది. అందుబాటులో ఏ వాహనం ఉంటే అందులో వెళ్లిపోవాలని హెచ్చరించింది. రష్యా దాడులు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని, భారతీయులు వెంటనే దేశం విడిచిపెట్టాలని పేర్కొంది. బోర్డర్ల దగ్గరికి చేరుకోవడానికి, బోర్డర్లు దాటేందుకు సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఉక్రెయిన్ లోని భారత ఎంబసీ తెలిపింది. ఈమేరకు మంగళవారం ఈ తాజా అడ్వైజరీ జారీ చేసింది. ఈ నెల 19న జారీ చేసిన మొదటి అడ్వైజరీలో భారతీయులు దేశం వీడేందుకు అవసరమైన మార్గాలను సూచించింది. ఉక్రెయిన్‌- హంగేరి, ఉక్రెయిన్‌- స్లోవేకియా, ఉక్రెయిన్‌- మాల్డోవా, ఉక్రెయిన్‌- పోలాండ్‌, ఉక్రెయిన్‌- రొమేనియా సరిహద్దుల నుంచి దేశం దాటొచ్చని పేర్కొంది.

ఇప్పటికీ అక్కడే ఉన్న విద్యార్థులు..

రష్యా దురాక్రమణ ప్రారంభమైన కొత్తలో ఉక్రెయిన్ లోని విద్యార్థుల్లో చాలామందిని భారత ప్రభుత్వం దేశానికి తీసుకొచ్చింది. అక్కడ సెటిలైన భారతీయులతో పాటు మరికొందరు విద్యార్థులు అక్కడే ఉండిపోయారు. యుద్ధం దీర్ఘకాలంగా కొనసాగుతుండడం, మధ్యలో దాడుల తీవ్రత కొంత తగ్గడంతో యూనివర్సిటీలు తెరుచుకున్నాయి. విదేశాలకు వెళ్లిపోయిన విద్యార్థులు తిరిగి రావాలని సూచించాయి. దీంతో రెండు, మూడు నెలల క్రితం భారత విద్యార్థులు మరోమారు ఉక్రెయిన్ వెళ్లారు. ఈలోపు రష్యా దాడులు తీవ్రం చేయడం, రాజధాని కీవ్ సహా ముఖ్యమైన నగరాల్లో క్షిపణులతో విరుచుకుపడడంతో అక్కడున్న విద్యార్థులతో పాటు భారత దేశంలో ఉన్న వాళ్ల తల్లిదండ్రులలో ఆందోళన వ్యక్తమవుతోంది. వాళ్ల కోసం ఉక్రెయిన్ లోని భారత రాయబార కార్యాలయం ఈ నెల 19న అడ్వైజరీ జారీ చేసింది. ఉక్రెయిన్ వీడాలని అందులో సూచించింది. దీంతో కొంతమంది దేశం వదలగా.. మరికొందరు మాత్రం అక్కడే ఉండిపోయారు.


More Telugu News