కోహ్లీ ఇన్నింగ్స్ చూశాక భావోద్వేగానికి గురయ్యాను: రవిశాస్త్రి

  • మెల్బోర్న్ లో పాక్ పై కోహ్లీ వీరోచిత ఇన్నింగ్స్
  • హరీస్ రవూఫ్ బౌలింగ్ లో వరుస సిక్సులు
  • కోహ్లీపై శాస్త్రి ప్రశంసల వర్షం
  • తాను ఇప్పటిదాకా చూసిన వాటిలో ఆ షాట్లే బెస్ట్ అని వెల్లడి
టీ20 వరల్డ్ కప్ లో పాకిస్థాన్ తో మ్యాచ్ లో విరాట్ కోహ్లీ సూపర్ బ్యాటింగ్ అభిమానులను అలరించమే కాకుండా, విమర్శలకు నోళ్లు మూయించింది. టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 

మనం గతాన్ని సులభంగా మర్చిపోతుంటామని, కోహ్లీ ఎంతగొప్ప ఇన్నింగ్స్ లు ఆడాడో ఎవరికీ గుర్తుండదని అన్నారు. గత రెండేళ్లుగా కోహ్లీ కెరీర్ పై ఎంతో ప్రచారం జరిగిందని, ఎన్నో విమర్శలు వచ్చాయని తెలిపారు. 

అలాంటి నేపథ్యంలో కోహ్లీ ఎలా ఫీలై ఉంటాడో తాను గ్రహించగలనని శాస్త్రి పేర్కొన్నారు. మీడియాతో పాటు విమర్శకుల ఒత్తిడి కూడా నెలకొన్న వేళ ఒక్క ఇన్నింగ్స్ తో అందరి నోళ్లు మూయించాడని అన్నారు. 

మెల్బోర్న్ లో కోహ్లీ ఆట చూశాక భావోద్వేగాలకు లోనయ్యానని తెలిపారు. తన క్రికెట్ జీవితంలో హరీస్ రవూఫ్ బౌలింగ్ లో కోహ్లీ కొట్టిన రెండు సిక్సులు 'ది బెస్ట్' అని చెప్పారు. ఆ రెండు సిక్సులకు 2003 వరల్డ్ కప్ లో షోయబ్ అక్తర్ బౌలింగ్ లో సచిన్ కొట్టిన సిక్స్ మాత్రమే సరితూగుతుందని రవిశాస్త్రి అభిప్రాయపడ్డారు. 

పాక్ జట్టులోని ఎంతో నాణ్యమైన పేస్ బౌలర్లను ఎదుర్కొని కోహ్లీ రాణించడం మామూలు విషయం కాదని తెలిపారు.


More Telugu News