ప్రధానిగా బాధ్యతలు అందుకున్న వెంటనే క్యాబినెట్ కూర్పుపై దృష్టి సారించిన రిషి సునాక్
- మహిళా ఎంపీ సువెల్లా బ్రేవర్ మన్ కు హోం శాఖ పగ్గాలు అప్పగింత
- కన్జర్వేటివ్ పార్టీ చైర్మన్ గా భారత సంతతికి చెందిన నదీమ్ జహావీ
- లిజ్ ట్రస్ కేబినెట్ లో పనిచేసిన పలువురికి అవే శాఖలను అప్పగించిన సునాక్
బ్రిటన్ ప్రధాన మంత్రిగా మంగళవారం సాయంత్రం పదవీ బాధ్యతలు చేపట్టిన భారత సంతతి నేత రిషి సునాక్... ఏమాత్రం ఆలస్యం చేయకుండానే రంగంలోకి దిగిపోయారు. బ్రిటన్ రాజు ఛార్లెస్ ని లాంఛనపూర్వకంగా కలిసిన అనంతరం, ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన సునాక్... వెనువెంటనే తన మంత్రివర్గ సభ్యులను ఎంపిక చేసే పనిలో పడిపోయారు. ఈ క్రమంలో లిజ్ ట్రస్ కేబినెట్ లో కీలక మంత్రులుగా పనిచేసిన వారిలో కొందరిని తిరిగి తన కేబినెట్ లోకి తీసుకుంటున్న సునాక్... కొత్తగా మరి కొందరికి కీలక బాధ్యతలు అప్పగిస్తున్నారు.
ఈ క్రమంలో ట్రస్ కేబినెట్ లో ఆర్థిక మంత్రిగా పనిచేసిన జెరెమీ హంట్ ను తన కేబినెట్ లోకి ఎంపిక చేసిన సునాక్...ఆయనకు అదే శాఖను అప్పగించారు. కొత్తగా డొమినిక్ రాబ్ ను తన కేబినెట్ లోకి తీసుకున్న సునాక్... ఆయనకు ఉప ప్రధాని పదవితో పాటు న్యాయ శాఖ పగ్గాలు అప్పగించారు. ట్రస్ మంత్రివర్గంలో విదేశాంగ శాఖ మంత్రిగా పనిచేసిన జేమ్ప్ క్లెవర్లీకి అదే శాఖ అప్పగించారు. అదే రీతిలో బెన్ వాలెస్ ను రక్షణ శాఖ మంత్రిగా కొనసాగించేందుకు నిర్ణయం తీసుకున్నారు. కొత్తగా ఒలివర్ డౌడెన్ ను మంత్రివర్గంలోకి తీసుకున్న సునాక్... ఆయనకు పన్నుల శాఖను అప్పగించారు.
ఇక పరిశ్రమలు, ఇంధన శాఖ మంత్రిగా గ్రాంట్ షాప్స్ ను సునాక్ ఎంచుకున్నారు. కీలకమైన హోం శాఖ మంత్రిగా మహిళా ఎంపీ సువెల్లా బ్రేవర్ మన్ ను ఎంపిక చేశారు. భారత మూలాలు ఉన్న నదీమ్ జహావీకి కన్జర్వేటివ్ పార్టీ చైర్మన్ పగ్గాలు అప్పగించారు. ట్రస్ కేబినెట్ లో రక్షణ శాఖ మంత్రిగా పనిచేసిన బెన్ వాలెస్ కు అదే శాఖను అప్పగించారు. సైమన్ హార్ట్ ను అధికార పార్టీ చీఫ్ విప్ గా నియమించారు. బుధవారంలోగా మిగిలిన శాఖలకు కూడా సునాక్ మంత్రులను ఎంపిక చేసే అవకాశాలున్నట్లు సమాచారం.