మోటార్లకు మీటర్లకు 95 శాతం మంది రైతులు సానుకూలం: మంత్రి పెద్దిరెడ్డి

  • మోటార్లకు మీటర్లతో విద్యుత్ సరఫరాపై రైతులకు హక్కు వచ్చినట్టేనన్న పెద్దిరెడ్డి
  • 2023 మార్చిలోగా మోటార్లకు మీటర్లు బిగిస్తామని వెల్లడి
  • తెలంగాణ నుంచి విద్యుత్ బకాయిలను కేంద్రమే ఇప్పించాలని డిమాండ్
వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు మోటార్లు బిగించే విషయంపై ఏపీ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం తిరుపతిలో మీడియాతో మాట్లాడిన మంత్రి... సాగు మోటార్లకు మీటర్లు బిగించే విషయంపై 95 శాతం మంది రైతులు అనుకూలంగా ఉన్నారని అన్నారు. అయితే ఈ విషయంపై విపక్ష టీడీపీ... మోటార్లకు మీటర్లతో రైతులకు ఊరితాడేనంటూ అసత్య ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. సాగు మోటార్లకు మీటర్ల ఏర్పాటుతో విద్యుత్ సరఫరాపై రైతుకు హక్కు కల్పించినట్లు అవుతుందన్నారు. 2023 మార్చిలోగా రాష్ట్రంలోని అన్ని సాగు మోటార్లకు మీటర్లు బిగిస్తామని ఆయన చెప్పారు. 

ఈ సందర్భంగా ఏపీకి తెలంగాణ చెల్లించాల్సిన విద్యుత్ బకాయిలపైనా పెద్దిరెడ్డి స్పందించారు. రాష్ట్ర విభజన సమయంలో కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకే తెలంగాణకు విద్యుత్ సరఫరా చేశామని ఆయన అన్నారు. ఈ క్రమంలో తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సిన బకాయిలను వసూలు చేయాల్సిన బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వానిదేనన్నారు. ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించామని చెప్పిన పెద్దిరెడ్డి... కోర్టు ఆదేశాలకు అనుగుణంగా చర్యలు చేపడతామని తెలిపారు.


More Telugu News