600 మందితో సాగుతున్న అమరావతి యాత్రలో రైతులు 60 మంది మాత్రమే: మంత్రి బొత్స సత్యనారాయణ

  • యాత్రలో ఎంతమంది ఉన్నారో తెలపాలని కోర్టు కోరిందన్న బొత్స
  • టీడీపీ వెనకుండి యాత్రను నడిపిస్తున్నందున రైతులు యాత్రను ఆపేశారని వెల్లడి
  • ఇది తన వ్యక్తిగత అభిప్రాయమేనన్న వైసీపీ కీలక నేత
ఏపీ ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ అమరావతి టూ అరసవెల్లి మహా పాదయాత్ర పేరిట రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులు చేస్తున్న పాదయాత్రపై ఏపీ విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మరోమారు విమర్శలు గుప్పించారు. 600 మందితో సాగుతున్నట్లుగా చెబుతున్న అమరావతి యాత్రలో రైతులు 60 మంది మాత్రమే ఉన్నారని ఆయన అన్నారు. ఈ మేరకు విజయనగరంలో మంగళవారం భోగాపురం ఎయిర్ పోర్టు భూసేకరణపై సమీక్ష అనంతరం మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

అమరావతి రైతుల పాదయాత్ర ఆగిపోయినట్లుగానే తాను భావిస్తున్నానని బొత్స అన్నారు. అంతేకాకుండా ఏది ఏమైనప్పటికీ విశాఖ పరిపాలనా రాజధానిగా ఉత్తరాంధ్ర ప్రజల కల సాకారమైనట్టేనని ఆయన పేర్కొన్నారు. అమరావతి యాత్రలో ఎంతమంది ఉన్నారని, వారికి సంబంధించిన వివరాలు ఇవ్వాలని కోర్టు అడిగిందని చెప్పారు. టీడీపీ వెనకుండి నడిపిస్తోంది కాబట్టే అమరావతి రైతులు పాదయాత్రను విరమించుకున్నారన్నారు. అయితే ఇది తన వ్యక్తిగత అభిప్రాయమేనని ఆయన చెప్పుకొచ్చారు. విశాఖ కేంద్రంగా పరిపాలనకు కొన్ని అడ్డంకులు ఉన్నాయని, వాటిని సాధ్యమైనంత త్వరలో పరిష్కరించి త్వరలోనే పరిపాలనా రాజధానిని విశాఖకు తరలిస్తామని ఆయన చెప్పారు.


More Telugu News