బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన రిషి సునాక్

  • అధికార కన్జర్వేటివ్ పార్టీ నేతగా నిన్ననే ఎన్నికైన సునాక్
  • ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ సునాక్ కు బ్రిటన్ రాజు ఆహ్వానం
  • ఆ వెంటనే ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన సునాక్
  • విపక్ష లేబర్ పార్టీ అభ్యంతరాలు బేఖాతరు చేసిన వైనం
బ్రిటన్ ప్రధాన మంత్రిగా భారత సంతతికి చెందిన రిషి సునాక్ మంగళవారం మధ్యాహ్నం బాధ్యతలు స్వీకరించారు. బ్రిటన్ పార్లమెంటులో అధికార కన్జర్వేటివ్ పార్టీ నాయకుడిగా సోమవారం ఎన్నికైన సునాక్ ను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా బ్రిటన్ రాజు ఛార్లెస్ 3 మంగళవారం ఆహ్వానం పలికారు. ఈ పిలుపు అందుకున్న సునాక్ బ్రిటన్ ప్రధానిగా పదవీ ప్రమాణం చేశారు. ఇక అతి త్వరలోనే ఆయన తన మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకోనున్నారు.

బ్రిటన్ చరిత్రలో ఓ భారత సంతతికి చెందిన వ్యక్తి ఆ దేశ ప్రధాని పదవిని చేపట్టడం ఇదే తొలి సారి. ఇటీవలే జరిగిన ప్రధాని ఎన్నికల్లో సునాక్ పై విజయం సాధించిన లిజ్ ట్రస్ కేవలం 45 రోజులకే తన పదవికి రాజీనామా చేశారు. దీంతో రెండో మారు ప్రధాని పదవికి సునాక్ పోటీ చేశారు. ప్రధాని పదవికి నామినేషన్ గడువు ముగిసే సమయానికి సునాక్ ఒక్కరి నామినేషనే బరిలో ఉండటంతో ఆయననే కన్జర్వేటివ్ పార్టీ తమ నేతగా ఎన్నుకుంది. అయితే ప్రధాని పదవిని ఎన్నిక లేకుండా ఎలా పూర్తి చేస్తారంటూ ఓ వైపు విపక్ష లేబర్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా... అవేవీ పట్టించుకోకుండా సునాక్ ప్రధాని పదవిని అధిష్టించారు.


More Telugu News