నయనతార సరోగసీ వివాదంపై రేపే తమిళ సర్కారుకు నివేదిక... చర్యలేమీ ఉండవంటూ కథనాలు

  • పెళ్లైన 4 నెలలకే కవల పిల్లలకు జన్మనిచ్చిన నయన్ దంపతులు
  • సరోగసీ వివాదం రేకెత్తడంతో కమిటీని నియమించిన తమిళనాడు సర్కారు
  • దుబాయిలో తమ స్నేహితురాలి ద్వారా నయన్ పిల్లలను కన్నట్లుగా వార్తలు
  • ఈ మేరకు ప్రభుత్వానికి పత్రాలు సమర్పించిన నయన్ దంపతులు
  • విచారణ కమిటీ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించినట్లుగా కథనాలు
ప్రముఖ హీరోయిన్ నయనతార, తమిళ దర్శకుడు విఘ్నేశ్ శివన్ దంపతులకు కలిగిన కవల పిల్లల వివాదంపై తమిళనాడు సర్కారు ఏర్పాటు చేసిన కమిటీ తన విచారణను పూర్తి చేసింది. రేపు (బుధవారం) ఆ కమిటీ తన నివేదికను తమిళనాడు ప్రభుత్వానికి అందజేయనుంది. ఈ నేపథ్యంలో నయన్ దంపతులకు శిక్ష తప్పదన్న వార్తలు అయితే ఇప్పుడు వినిపించడం లేదు. ఈ వివాదంపై విచారణ ముగించిన కమిటీ కూడా ఇదే విషయాన్ని తన నివేదికలో తేల్చేసినట్లు సమాచారం. దీంతో ఈ వివాదం నుంచి ఎలాంటి శిక్షలు లేకుండానే నయన్ దంపతులు బయటపడనున్నారు.

పెళ్లి అయిన 4 నెలలకే నయన్ దంపతులకు కవల పిల్లలు పుట్టడం, సరోగసీ (అద్దె గర్భం) ద్వారానే వారు ఈ కవల పిల్లలను కన్నారని వివాదం చెలరేగడం తెలిసిందే. ఈ క్రమంలో నయన్ దంపతులపై విమర్శలు రేకెత్తాయి. వివాదం ముదరకముందే స్పందించిన తమిళనాడు ప్రభుత్వం ఈ వివాదంలోని వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు ముగ్గుకు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. అయితే ఓ వైపు కమిటీ విచారణ జరుపుతుండగానే... మరోవైపు నయన్ దంపతులు కొన్ని పత్రాలను ప్రభుత్వానికి సమర్పించారట. 

ప్రభుత్వానికి అందించిన పత్రాల్లో తమకు కలిగిన కవల పిల్లలను తాము తమ స్నేహితురాలి ద్వారా కన్నామని నయన్ దంపతులు తెలిపారు. అది కూడా భారత్ లో కాకుండా దుబాయిలో కవల పిల్లలు జన్మించారని తెలిపారు. భారత్ లో అయితే సరోగసీ చట్ట విరుద్ధంగా గానీ, దుబాయిలో ఇదేమీ చట్ట విరుద్ధం కాదని వారు తెలిపారు. అంతేకాకుండా ఈ విషయంపై ఎలాగూ వివాదం ముసురుకుంటుందని... ముందే అందుకు సంబంధించిన పత్రాలను దాచి పెట్టినట్లు నయన్ దంపతులు తెలిపారు. ఇదే విషయాన్ని కమిటీ కూడా తన నివేదికలో పొందుపరుస్తూ ప్రభుత్వానికి నివేదిక అందించనున్నట్లు సమాచారం. వెరసి ఎలాంటి శిక్షలు లేకుండానే నయన్ దంపతులు ఈ వివాదం నుంచి బయటపడనున్నారంటూ విశ్లేషణలు వినిపిస్తున్నాయి.


More Telugu News