ఆర్థికవేత్త నుంచి ప్రధానమంత్రి దాకా... రిషి సునాక్ ప్రస్థానం ఇదిగో!

  • బ్రిటన్ లో అత్యంత పిన్న వయసు ప్రధానిగా సునాక్
  • రిషి సునాక్ కు పంజాబ్ మూలాలు
  • ఆఫ్రికా దేశాలకు వలస వెళ్లిన సునాక్ పూర్వీకులు
  • అక్కడ్నించి బ్రిటన్ తరలి వెళ్లిన సునాక్ తల్లిదండ్రులు
  • బ్రిటన్ లోని 250 సంపన్న కుటుంబాల్లో సునాక్ ఫ్యామిలీ
భారతీయ మూలాలున్న రిషి సునాక్ బ్రిటన్ కొత్త ప్రధానిగా ఎన్నికయ్యారు. 42 ఏళ్ల సునాక్ బ్రిటీష్ ప్రధాని పీఠం ఎక్కిన అత్యంత పిన్నవయస్కుడిగా రికార్డు నెలకొల్పారు. గతంలో బ్రిటీష్ పాలనలో భారత్ మగ్గిపోగా... ఇప్పుడు భారత సంతతి వ్యక్తే బ్రిటన్ ను పరిపాలించనుండడం చరిత్రలో నిలిచిపోయే అంశం. 

ఈ నేపథ్యంలో, రిషి సునాక్ వివరాల్లోకి వెళితే... రిషి సునాక్ తల్లిదండ్రులు ఉష, యశ్వీర్. వీరి మూలాలు పంజాబ్ లో ఉన్నాయి. వారి పూర్వీకులు టాంజానియా, కెన్యా వలస వెళ్లినట్టు తెలుస్తోంది. ఉష, యశ్వీర్ టాంజానియా, కెన్యా దేశాల నుంచి బ్రిటన్ కు వలస వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. 

రిషి సునాక్ తండ్రి యశ్వీర్ ఓ డాక్టర్ కాగా, తల్లి ఉష ఓ మెడికల్ షాపు యజమాని. రిషి సునాక్ 1980 మే 12న ఇంగ్లండ్ లోని సౌథాంప్టన్ నగరంలో జన్మించారు. ఆర్థిక రంగాన్ని తన కెరీర్ గా ఎంచుకున్నారు. ప్రఖ్యాత ఆక్స్ ఫర్డ్, స్టాన్ ఫర్డ్ యూనివర్సిటీల్లో ఉన్నత విద్యాభ్యాసం చేశారు. ఆక్స్ ఫర్డ్ లో ఎకనామిక్స్, పాలిటిక్స్, ఫిలాసఫీ సబ్జెక్టులతో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. స్టాన్ ఫర్డ్ నుంచి ఎంబీఏ పట్టా అందుకున్నారు. 

రిషి సునాక్ 2001-04 మధ్యకాలంలో ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ గోల్డ్ మన్ సాక్స్ లో అనలిస్ట్ గా పనిచేశారు. 2004 నుంచి 2015 మధ్య కాలంలో వివిధ ఫండ్ మేనేజ్ మెంట్ సంస్థల్లో బాధ్యతలు నిర్వర్తించారు. 2015లో రాజకీయాలపై ఆసక్తితో కన్జర్వేటివ్ పార్టీలోకి వచ్చారు. కొత్త తరం నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. రిచ్ మండ్ నియోజకవర్గం నుంచి ఎంపీ అయ్యారు.

రిషి సునాక్ కరోనా సంక్షోభ సమయంలో ఆర్థికమంత్రిగా విశిష్ట సేవలు అందించి సత్తా చాటుకున్నారు. థెరెస్సా మే, బోరిస్ జాన్సన్ ప్రభుత్వాల్లో కీలక బాధ్యతలు చేపట్టి సమర్థుడిగా గుర్తింపు పొందారు. బ్రిటన్ రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగి, ఇప్పుడు ప్రధానమంత్రి అయ్యారు.  

బ్రిటన్ లోని 250 సంపన్న కుటుంబాల్లో రిషి సునాక్ ఫ్యామిలీ ఒకటి. వీరికి 750 మిలియన్ పౌండ్ల సంపద ఉన్నట్టు అంచనా. ఆయన క్రికెట్, సాకర్, సినిమాలు, ఫిట్ నెస్ పై మక్కువ చూపిస్తారు.


More Telugu News