టీమిండియా చేతిలో ఓటమిపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు ఎవరేమన్నారంటే...!

  • టీ20 వరల్డ్ కప్ లో భారత్ చేతిలో పాక్ ఓటమి
  • పాక్ పోరాడి ఓడిందన్న రమీజ్ రాజా
  • నోబాల్ వివాదంపై స్పందించిన అక్తర్
ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 ప్రపంచకప్ లో భారత్ చేతిలో పాకిస్థాన్ ఓటమిపాలవడం తెలిసిందే. దీనిపై పాక్ మాజీ క్రికెటర్లు స్పందించారు. ప్రస్తుతం పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్ గా వ్యవహరిస్తున్న రమీజ్ రాజా స్పందిస్తూ, ఈ మ్యాచ్ లో పాక్ పోరాడి ఓడిందని, పాక్ జట్టు కనబర్చిన పోరాటపటిమ సంతోషం కలిగించిందని పేర్కొన్నారు. ఓవరాల్ గా ఇదొక క్లాసిక్ మ్యాచ్ అని అభివర్ణించారు. 

"కొన్ని మ్యాచ్ లు గెలుస్తాం, కొన్ని ఓడిపోతాం... క్రికెట్ క్రూరమైనదే కాదు అన్యాయమైనది కూడా. పాకిస్థాన్ నేటి మ్యాచ్ లో బ్యాట్ తో, బంతితో రాణించకపోవచ్చు... కానీ వారి మ్యాచ్ లో పోరాడిన తీరు పట్ల గర్విస్తున్నాం" అని రమీజ్ రాజా ట్వీట్ చేశారు. 

మాజీ పేసర్ షోయబ్ అక్తర్ ఈ మ్యాచ్ లోని నోబాల్ వివాదంపై స్పందించారు. ఆఖర్లో పాక్ స్పిన్నర్ నవాజ్ విసిరిన హై ఫుల్ టాస్ ను కోహ్లీ సిక్సర్ కొట్టడం తెలిసిందే. ఈ బాల్ ను అంపైర్ నోబాల్ గా ప్రకటించగా, భారత్ దాన్నుంచి లబ్ది పొందింది. అయితే ఆ బంతి నడుం ఎత్తు కంటే తక్కువ ఎత్తులోనే వచ్చిందని, అది నోబాల్ ఎలా అవుతుందని విమర్శలు వచ్చాయి. అక్తర్ కూడా ఇదే తరహా అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. 

"అంపైర్ అన్నయ్యలూ.... ఈ రాత్రి మీ మెదడుకు మేత ఇదిగో!" అంటూ ఫుల్ టాస్ బంతి ఫొటోను పంచుకున్నాడు. "ఇది నోబాల్ ఎలా అవుతుంది? అంపైర్లు ఆలోచించాలి!" అనే రీతిలో అక్తర్ ఆ ఫొటోపై స్పందించాడు. 

అటు భారత్ ప్రముఖులు కూడా ఈ మ్యాచ్ పై స్పందించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందిస్తూ, టీ20 వరల్డ్ కప్ లో తన ప్రస్థానాన్ని భారత్ ఘనంగా ప్రారంభించిందని వ్యాఖ్యానించారు. దేశంలో దీపావళి మొదలైందని పేర్కొన్నారు. విరాట్ కోహ్లీ అద్భుతంగా ఆడాడని కితాబిచ్చారు. టీమిండియాకు శుభాకాంక్షలు తెలిపారు.

బీసీసీఐ కార్యదర్శి జై షా స్పందిస్తూ, వేటగాడు విరాట్ కోహ్లీ తన పూర్వపు ఫామ్ అందుకున్నాడని కొనియాడారు. ఈ మ్యాచ్ ద్వారా తన నైపుణ్యాలను అద్భుతంగా ప్రదర్శించాడని ప్రశంసించారు. ఒక అపూర్వమైన మ్యాచ్ ను చూశామని పేర్కొన్నారు. 

భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఈ మ్యాచ్ ను ఓ థ్రిల్లర్ గేమ్ అని అభివర్ణించారు. ఈ మ్యాచ్ లో విజయం సాధించడం ద్వారా టీ20 వరల్డ్ కప్ లో భారత్ శుభారంభం చేసిందని తెలిపారు. ఈ మ్యాచ్ లో పలు వ్యక్తిగత ప్రదర్శనలు నమోదైనా, విరాట్ కోహ్లీతో కలిసి హార్దిక్ పాండ్యా నమోదు చేసిన భాగస్వామ్యమే భారత్ విజయానికి కీలకంగా మారిందని అభిప్రాయపడ్డారు.


More Telugu News