మహిళను చెంప చెళ్లుమనేలా కొట్టి... ఆపై క్షమాపణలు చెప్పిన కర్ణాటక మంత్రి

  • వివాదంలో కర్ణాటక మంత్రి సోమన్న
  • హంగ్లా గ్రామంలో ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమం
  • అర్జీ ఇచ్చేందుకు ప్రయత్నించిన మహిళ
  • సహనం కోల్పోయిన మంత్రి సోమన్న
  • వీడియో వైరల్
కర్ణాటక మంత్రి వి.సోమన్న వివాదంలో చిక్కుకున్నారు. ఆయన ఓ మహిళను చెంప చెళ్లుమనేలా కొట్టిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. తన సమస్యను పరిష్కరించాలంటూ అర్జీతో వచ్చిన ఆ మహిళపై మంత్రి సోమన్న చేయిచేసుకున్నట్టు ఆ వీడియోలో కనిపించింది. 

చామరాజనగర్ జిల్లాలోని హంగ్లా గ్రామంలో జరిగిన ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఉండడానికి సొంత ఇళ్లు లేక ప్రభుత్వ భూములను ఆక్రమించిన పేదలకు ఈ మేరకు పట్టాలు అందించారు. అయితే తాను కూడా నిరుపేదనే అని, తనకు కూడా ఇళ్ల స్థలం కేటాయించాలంటూ కెంపమ్మ అనే మహిళ విజ్ఞాపన పత్రంతో మంత్రిని వేడుకుంది. అయితే ఆమె తీరు పట్ల మంత్రి సోమన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరూ చూస్తుండగానే ఆమె చెంప చెళ్లుమనిపించారు. 

అయితే దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో మంత్రి స్పందించారు. ఇదేమంత పెద్ద ఘటన కాదని చెప్పుకొచ్చారు. తాను 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని తెలిపారు. పేదలకు మేలు చేసే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి తాను హాజరయ్యానని, తాను ఎవరి పట్ల అనుచితంగా ప్రవర్తించలేదని మంత్రి సోమన్న స్పష్టం చేశారు. ఒకవేళ ఎవరైనా బాధపడి ఉంటే అందుకు చింతిస్తున్నానని, క్షమాపణలు తెలుపుకుంటున్నానని వివరించారు. 

అంతేకాదు, ఆ మహిళ పదేపదే వేదికపైకి వస్తూ ఇబ్బంది కలిగించిందని అన్నారు. అలా రావొద్దని ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోలేదని మంత్రి ఆరోపించారు. తాను వేదిక దిగొచ్చిన తర్వాత కూడా ఆమె అసహనం కలిగించేలా ప్రవర్తించిందని తెలిపారు. ఆమె సమస్యను పరిష్కరిస్తానని చెప్పినా పట్టించుకోకుండా విసుగుపుట్టించిందని వివరించారు. ఓ పక్కన నిలబడాలంటూ ఆమెను చేత్తో అదిలించే ప్రయత్నం చేశానని మంత్రి స్పష్టం చేశారు. 

కాగా, ఈ ఘటన రాజకీయ రంగు పులుముకుంది. మంత్రి సోమన్న తన అసలు సంస్కృతిని బయటపెట్టుకున్నాడని మాజీ సీఎం సిద్ధరామయ్య విమర్శించారు. అభాగ్యురాలైన మహిళ పట్ల అనుచితంగా ప్రవర్తించిన సోమన్న మంత్రి పదవికి అనర్హుడని పేర్కొన్నారు.


More Telugu News