పండుగల సమయాల్లో హార్ట్ ఎటాక్.. ఎందుకని?

  • అధిక ఆల్కహాల్, చక్కెర, ఉప్పు పదార్థాలను తీసుకోవడమే రిస్క్
  • వీటి కారణంగా గుండె స్పందనల్లో మార్పులు, అధిక రక్తపోటు
  • ఫలితంగా హార్ట్ ఎటాక్, ఫెయిల్యూర్, స్ట్రోక్ సమస్యలు
వయసుతో సంబంధం లేకుండా హార్ట్ ఎటాక్, హార్ట్ ఫెయిల్యూర్ ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. గుజరాత్ లోని ఆనంద్ లో దాండియా ఆడుతూ 21 ఏళ్ల కుర్రాడు కుప్ప కూలిపోయి ప్రాణాలు విడవడం గుర్తుండే ఉంటుంది. ముంబైలో గార్బా ఆడుతున్న సందర్భంలోనూ ఇలాంటి విషాదమే చోటు చేసుకుంది. పండుగల సమయాల్లో ఇలాంటివి వెలుగు చూడడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అప్పటి వరకు ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు ఒక్కసారిగా కుప్పకూలి పోవడం అంతుబట్టడం లేదు. 

దీనిపై వైద్య నిపుణుల మాటలను ఓసారి ఆలకించాల్సిందే. ‘‘పండుగలు అంటేనే సంబరాలతో కూడి ఉంటాయి. ఆ సమయంలో ఎన్నో పిండి వంటలు చేసుకోవడం, తినడం సాధారణం. సాధారణ రోజులతో పోలిస్తే ఎక్కువగా తింటుంటారు. అలాగే స్వీట్స్, ఆల్కహాల్ తీసుకుంటారు. ఇది మరింత హాని చేస్తోంది. ముఖ్యంగా గుండె సమస్యలకు దారితీస్తోంది’’అని హైదాబాద్ లోని సిటిజన్స్ హాస్పిటల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ సుధీర్ కోగంటి తెలిపారు.

‘‘ఆల్కహాల్ తీసుకోవడం, నచ్చిన ఫుడ్ తినడం ఏడాదిలో ఎప్పుడైనా చేస్తుంటారు. పండుగల సందర్భాల్లో అయితే ఆల్కహాల్ కు తోడు, ఎక్కువగా వేయించిన పదార్థాలు, స్వీట్స్, తీసుకుంటుంటారు. ఆల్కహాల్, ఉప్పు అధికంగా తీసుకుంటే అది గుండె కొట్టుకోవడాన్ని అసమంజసంగా (పాల్పిటేషన్స్) మార్చేస్తుంది. దీన్ని నిర్లక్ష్యం చేస్తే అది తీవ్రమైన గుండె సమస్యగా, గుండె వైఫల్యం, స్ట్రోక్ కు దారితీయవచ్చు’’అని సుధీర్ హెచ్చరించారు.

దీపావళి సమయంలో క్రాకర్స్ వల్ల గాలి, శబ్ధ కాలుష్యం పెరిగిపోతుందని.. దీంతో ముందు నుంచి ఉన్న శ్వాసకోశ, గుండె సంబంధిత సమస్యలు పెరగడానికి కారణమవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిద్రలేమి, అధిక రక్తపోటు, గుండెపోటుకు కారణమవుతుందంటున్నారు. దీనికి కొన్ని నివారణ చర్యలను వైద్యులు సూచిస్తున్నారు.

ఆల్కహాల్ పరిమితికి మించి తీసుకోకపోవడం, ఉప్పు, పంచదార, ఫ్యాట్స్ ఉన్న పదార్థాల పట్ల జాగ్రత్తగా ఉండడం అవసరమని పేర్కొంటున్నారు. రద్దీ ప్రాంతాలకు దూరంగా ఉండాలని, శ్వాస తీసుకోవడం, గుండె కొట్టుకోవడంలో మార్పులు, తలతిరగడం కనిపిస్తే అత్యవసర వైద్య సాయం పొందాలని సూచిస్తున్నారు.


More Telugu News