పోలీసులకు చుక్కలు చూపించిన మందుబాబు.. స్టేషన్‌లో వందేమాతరం ఆలపిస్తూ మార్చ్‌ఫాస్ట్!

  • బీహార్‌లోని సోసరాయ్‌లో ఘటన
  • మూడు గంటలపాటు నానా హంగామా చేసిన తాగుబోతు
  • కుటుంబ సభ్యులను పిలిపించి నిమ్మరసం ఇచ్చినా లేని ఫలితం
  • చివరికి సెల్‌లో వేసిన పోలీసులు
మద్యనిషేధం అమల్లో ఉన్న బీహార్‌లో పోలీసులకు పట్టుబడిన ఓ మందుబాబు స్టేషన్‌లో వీరంగమేశాడు. వింత చేష్టలతో పోలీసులకు చుక్కలు చూపించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మద్యం తాగుతూ పట్టుబడిన ఓ వ్యక్తిని నలందలోని సోసరాయ్ పోలీసులు పట్టుకుని స్టేషన్‌కు తీసుకెళ్లారు. పోలీస్ స్టేషన్‌లో అతడు అడుగు పెట్టగానే వందేమాతరం ఆలపిస్తూ మార్చ్‌ఫాస్ట్ చేశాడు. అతడు ఒక్కసారిగా వందేమాతరం అందుకోవడంతో పోలీసులు ఏమీ చేయలేక దిక్కులు చూస్తుండిపోయారు. 

బీహార్‌లో సంపూర్ణ మద్య నిషేధం అమల్లో ఉన్నప్పటికీ నిత్యం మద్యం కేసులు వెలుగు చూస్తూనే ఉన్నాయి. సరిహద్దు ప్రాంతాల నుంచి మద్యం తెచ్చుకుని తాగుతున్న ఘటనలు అక్కడ కొత్తకాదు. ఇక, తాజా విషయానికి వస్తే ఆ యువకుడి పేరు సురేంద్ర ప్రసాద్. అర్ధరాత్రి వేళ తాగి ఊగుతున్న అతడిని గమనించిన పెట్రోలింగ్ పోలీసులు పట్టుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. 

అప్పటికే పూర్తి మద్యం మత్తులో ఉన్న సురేంద్ర ప్రసాద్ పోలీస్ స్టేషన్‌కు రాగానే అక్కడున్న వస్తువులను విసిరివేయడం ప్రారంభించాడు. దాదాపు  మూడు గంటలపాటు స్టేషన్‌లోని పోలీసులకు చిరాకు తెప్పించాడు. వందేమాతరం  పాడుతూ, మార్చ్‌ఫాస్ట్ చేస్తూ పోలీసులను నానా రకాలుగా ఇబ్బంది పెట్టాడు. చివరికి ఇలా కాదని చెప్పి పోలీసులు అతడి కుటుంబాన్ని పిలిపించారు. వారొచ్చి అతడి మత్తు దించేందుకు నిమ్మరసం పట్టారు. అయితే, ఆ ప్రయత్నం కూడా విఫలం కావడంతో రాత్రంతా అతడిని సెల్‌లో ఉంచినట్టు పోలీసులు తెలిపారు.


More Telugu News