కంప్యూటర్ లో చెత్తను ఊడ్చిపారేసే మైక్రోసాఫ్ట్ కొత్త యాప్!

  • 'పీసీ మేనేజర్' యాప్ ను తీసుకువస్తున్న మైక్రోసాఫ్ట్
  • ప్రస్తుతం బీటా వెర్షన్ లో యాప్
  • విండోస్ 10, ఆపై వెర్షన్లతో పనిచేసే యాప్
  • త్వరలోనే మార్కెట్లోకి!
ఒకప్పటితో పోల్చితే ఇంటర్నెట్ వినియోగం ఇప్పుడు చాలా పెరిగింది. ఇంటర్నెట్ సాయంతో ఎన్నో వెబ్ సైట్లను, పోర్టళ్లను సందర్శిస్తుంటారు. ఫైళ్లు, పాటలు, సినిమాలు, వీడియోలు డౌన్ లోడ్ చేస్తుంటారు. ఆ సమయంలో అనేక రకాలుగా కంప్యూటర్ లో అనవసర ఫైళ్లు పేరుకుపోతాయి. ఇవి కంప్యూటర్ పనితీరును మందగించేలా చేస్తాయి. దాంతో వేగంగా పనిచేయలేక యూజర్లు ఎంతో ఇబ్బందిపడతారు. 

వీటన్నింటికి పరిష్కారం దిశగా టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కొత్త యాప్ తీసుకువస్తోంది. ఈ యాప్ పీసీలో మూలమూలలా దాగివున్న అనవసర చెత్తను ఏరిపారేస్తోంది. తద్వారా కంప్యూటర్ చురుకుగా, మెరుగైన పనితీరు కనబరిచేందుకు దోహదపడుతుంది. ప్రస్తుతం ఈ యాప్ అభివృద్ధి దశలో ఉంది. 

మైక్రోసాఫ్ట్ స్టోర్ లో ఇలాంటి క్లీనింగ్ యాప్ లే కొన్ని ఉన్నప్పటికీ, వాటన్నిటి కంటే ఇది ప్రభావవంతంగా పనిచేస్తుందని మైక్రోసాఫ్ట్ చెబుతోంది. కాగా, ఈ కొత్త యాప్ కు పీసీ మేనేజర్ గా నామకరణం చేసినట్టు తెలుస్తోంది. ఇది విండోస్ 10, ఆపై వెర్షన్లతో పనిచేస్తుంది.

విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ నిదానించడానికి గల కారణాలను అన్వేషించి ఆ దిశగా క్లీనింగ్ ప్రక్రియ చేపట్టడమే కాకుండా, సిస్టమ్ స్టోరేజి స్పేస్ ను కూడా ఓ చూపు చూస్తుంది. స్టోరేజిలో చెత్త ఫైళ్లు చేరకుండా ప్రక్షాళన చేస్తూ, తగినంత స్పేస్ ఉండేలా చూస్తుంది. 

అంతేకాదు, ఈ యాప్ సాయంతో కంప్యూటర్ లో అసాధారణ మార్పులను గుర్తించవచ్చు. కేవలం ఒక్క క్లిక్ తో వైరస్ లను గుర్తించడమే కాకుండా, తగిన పరిష్కారాలను కూడా చూపుతుంది. ఈ మేరకు మైక్రోసాఫ్ట్ వెబ్ సైట్ లో పేర్కొన్నారు. త్వరలోనే ఇది కొన్ని ప్రత్యేకమైన మార్కెట్లలోనే అందుబాటులోకి రానుంది.


More Telugu News