వివేకా హత్యపై షర్మిల స్పందన హర్షణీయం: తులసిరెడ్డి, బీటెక్ రవి
- జగన్ బాధితుల వైపు కాకుండా నిందితుల వైపు ఉన్నారన్న తులసిరెడ్డి
- వివేకా హంతకులు స్వేచ్ఛగా తిరుగుతున్నారన్న బీటెక్ రవి
- ఎంపీ సీటు విషయం గురించే వివేకాను హత్య చేశారని ఆరోపణ
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తును వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని సుప్రీంకోర్టు నిర్ణయించడంపై వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల హర్షం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. వివేకా కుమార్తె సునీతకు న్యాయం జరగాలని ఆమె ఆకాంక్షించారు. ఈ నేపథ్యంలో, కాంగ్రెస్ నేత తులసిరెడ్డి స్పందిస్తూ షర్మిల వ్యాఖ్యలను స్వాగతిస్తున్నామని చెప్పారు. వివేకా హత్య విషయంలో ముఖ్యమంత్రి జగన్ బాధితుల వైపు కాకుండా నిందితుల వైపు ఉన్నట్టు స్పష్టమవుతోందని అన్నారు. జగన్ పాలన ఔరంగజేబు పాలనను గుర్తు చేస్తోందని చెప్పారు. ప్రజాస్వామ్యంలో క్రూరమైన పాలన ఉండకూడదని చెప్పారు.
ఇదే అంశంపై టీడీపీ నేత బీటెక్ రవి మాట్లాడుతూ... కేసును వేరే రాష్ట్రానికి బదిలీ చేయడం సబబే అని షర్మిల అన్నారని చెప్పారు. ఈ కేసులో సాక్షులను బెదిరిస్తున్నారనే విషయం షర్మిలకు కూడా తెలుసని అన్నారు. కేసును విచారిస్తున్న అధికారులపై కూడా కేసులు పెట్టడం ఏమిటని మండిపడ్డారు. వివేకా హంతకులు సెంట్రల్ జైలు నుంచి స్వేచ్ఛగా బయటకు వస్తున్నారని చెప్పారు. కడప ఎంపీ సీటు విషయంలో వివేకా అడ్డు తగలడంతోనే ఆయనను హత్య చేశారని తెలిపారు. వివేకా హత్య జరిగిన వెంటనే లోటస్ పాండ్ లో ఉన్న జగన్ కు అన్ని వివరాలు తెలిసిపోయాయని చెప్పారు. హంతకులకు కొమ్ముకాస్తున్న జగన్ వెంటనే సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.