బాలిక ప్రాణాలను కాపాడిన యాపిల్ వాచ్

  • అసహజమైన గుండె స్పందనలపై స్మార్ట్ వాచ్ నుంచి అలర్ట్ లు
  • దీన్ని గుర్తించిన బాలిక తల్లి
  • వైద్యుల వద్దకు తీసుకెళ్లడంతో బయటపడిన ట్యూమర్
  • కేన్సర్ గా గుర్తించడంతో సర్జరీ
స్మార్ట్ వాచ్ కేవలం అందం కోసమో, సౌకర్యానికో అనుకుంటే పొరపాటే. ఇవి ప్రాణాలను కాపాడే సాధనాలుగా పని చేస్తున్నాయని చెప్పుకోవాల్సిందే. ఎందుకంటే యాపిల్ స్మార్ట్ వాచ్ ఇచ్చిన అలర్ట్ ఓ 12 ఏళ్ల బాలిక ప్రాణాలను కాపాడింది. గుండె స్పందనలు అసహజంగా ఉంటే అప్రమత్తం చేసే స్మార్ట్ వాచ్ లు ఎన్నో ఉన్నాయి. యాపిల్ వాచ్ లోనూ ఇలాంటి హెల్త్ ఫీచర్లు ఎన్నో ఉన్నాయి. యాపిల్ వాచ్ ఎస్ఈ, వాచ్ 7, వాచ్ 8, వాచ్ 8 అల్ట్రాలో హార్ట్ రేట్ నోటిఫికేషన్ల ఫీచర్లు ఉన్నాయి.

హవర్ డెట్రాయిట్ మేగజైన్ ప్రచురించిన ఓ కథనం ప్రకారం.. 12 ఏళ్ల ఇమాని మైల్స్ యాపిల్ వాచ్ ధరించేది. ఆమె హార్ట్ రేటు అసాధారణంగా ఉందంటూ వాచ్ పదే పదే అలర్ట్ చేస్తోంది. ఆమె తల్లి జెస్సికా కిచెన్ దీన్ని గుర్తించింది. తన కుమార్తెను వైద్యుల వద్దకు తీసుకెళ్లింది. వైద్యులు పూర్తి స్థాయి పరీక్షలు చేశారు. అపెండిక్స్ లో న్యూరో ఎండోక్రైన్ ట్యూమర్ ఉందని తేల్చారు. పిల్లల్లో ఇది చాలా అసాధారణమని పేర్కొన్నారు.

తదుపరి పరీక్షల్లో సదరు ట్యూమర్ పెరుగుతూ, ఇతర అవయాలకూ విస్తరిస్తున్నట్టు వైద్యులు గుర్తించారు. దీన్ని కేన్సర్ ట్యూమర్ గా గుర్తించి సర్జరీ ద్వారా తొలగించారు. మొత్తం మీద ఈ మహమ్మారి నుంచి బాలిక బయటపడింది. యాపిల్ వాచ్ అలర్ట్ చేయకపోతే, తాను వెంటనే వైద్యుల వద్దకు తన కూతుర్ని తీసుకెళ్లి ఉండకపోయేదానినని, ఆమె ప్రాణాలకు ముప్పు ఏర్పడేదని జెస్సికా కిచెన్ పేర్కొంది. 

ఇదే అని కాదు. మరెంతో మంది ప్రాణాలను స్మార్ట్ వాచ్ లు కాపాడుతున్నాయి. ఇటీవలే బ్రిటన్ లో 57 ఏళ్ల వ్యక్తికి హార్ట్ రేట్ గురించి వరుసగా 3,000 సార్లు అలర్ట్ చేసి యాపిల్ వాచ్ ప్రాణాలు కాపాడింది.


More Telugu News