టీ20 ప్రపంచ కప్ సూపర్12 మ్యాచ్​.. ఆసీస్​ కు భారీ టార్గెట్​ ఇచ్చిన న్యూజిలాండ్

  • 20 ఓవర్లలో 200/3 స్కోరు చేసిన కివీస్
  • భారీ ఇన్నింగ్స్ తో చెలరేగిన డేవాన్ కాన్వే
  • రాణించిన ఫిన్ అలెన్
టీ20 ప్రపంచ కప్ సూపర్12 తొలి మ్యాచ్ లో న్యూజిలాండ్ బ్యాటింగ్ లో అదరగొట్టింది. గతేడాది ఫైనల్లో ఓడిపోయిన కివీస్ ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియాకు 201 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇచ్చింది. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ లో జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకుంది. ఈ నిర్ణయం తప్పని నిరూపించేలా కివీస్ చెలరేగి ఆడింది. బ్యాటింగ్ కు వచ్చిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. ఓపెనర్ డేవాన్ కాన్వే (58 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 92 నాటౌట్) విధ్వంసకర ఇన్నింగ్స్ తో రెచ్చిపోయాడు.

 మరో ఓపెనర్ ఫిన్ అలెన్ (16 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 42) మెరుపులు మెరిపించాడు. ఈ ఇద్దరూ తొలి వికెట్ కు 56 పరుగులు జోడించారు. తర్వాత కెప్టెన్ కేన్ విలియమ్సన్ (23) సహకారంతో కాన్వే దూకుడు కొనసాగించాడు. రెండో వికెట్ కు 69 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఆ తర్వాత విలియమ్సన్, గ్లెన్ ఫిలిప్స్ (12) తక్కువ స్కోర్లకే అవుటయ్యారు. చివర్లో జిమ్మీ నీషమ్ (13 బంతుల్లో 3 సిక్సర్లతో 26 నాటౌట్) మెరుపులతో కాన్వే కివీస్ స్కోరు 200 మార్కు దాటించాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో జోష్ హేజిల్ వుడ్ (2/41) రెండు వికెట్లు పడగొట్టగా.. ఆడమ్ జంపా (1/39) ఒక వికెట్ పడగొట్టాడు.


More Telugu News