హైవేపై సాహసం.. 310 కి.మీ వేగంతో బైక్ నడిపి వీడియో పోస్ట్ చేసిన రైడర్

  • హర్యానాలోని వెస్ట్రన్ పెరిఫెరల్ ఎక్స్ ప్రెస్ వేపై నడిపిన రైడర్
  • వేగాన్ని వీడియో తీసి యూట్యూబ్‌ లో అప్ లోడ్ చేసిన వైనం
  • ఈ మధ్య యూపీలో 300 కి.మీ వేగంతో కారు నడిపి ప్రమాదంలో నలుగురి మృతి
అతి వేగం ప్రమాదకరం. ప్రాణాంతకం అని తెలిసినా కొందరు సరదా కోసం అతి వేగంగా వెళ్లి ప్రాణాపాయాన్ని కొని తెచ్చుకుంటారు. ఈ మధ్య ఉత్తరప్రదేశ్‌లోని పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై 300 కిమీ వేగంతో వెళ్తున్న నలుగురు వ్యక్తులు బీఎమ్‌డబ్ల్యూ కారు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటన మర్చిపోకముందే  హర్యానాలోని వెస్ట్రన్ పెరిఫెరల్ ఎక్స్‌ప్రెస్‌వేపై గంటకు 310 కి.మీ వేగంతో ఒక వ్యక్తి తన బైక్‌ను నడుపుతున్న వీడియో బయటపడింది.

ఆగస్ట్ 20న 'వైల్డ్ వింగ్ రైడర్' యూట్యూబ్ ఛానెల్‌లో ఈ వీడియో అప్‌లోడ్ అయింది. ఇందులో బైకర్ దిల్‌ప్రీత్, మరికొందరు బైకర్లతో కలిసి ఆదివారం రైడ్ కోసం బయలుదేరాడు. వీడియో చిత్రీకరిస్తున్నప్పుడు అతను 310 కి.మీ వేగాన్ని చాలాసార్లు తాకినట్లు కనిపించింది. బైకర్లు నింజా 2000, బీఎండబ్ల్యూ, డ్యుకాటీ, అపాచీ 310 వంటి హై ఎండ్ బైకులపై వాయు వేగంతో దూసుకెళ్లారు. 300 కి.మీ వేగం అందుకున్న రైడర్ దిల్‌ప్రీత్ తన మాదిరిగా ఎవ్వరూ ఇలాంటి సాహనం చేయొద్దని వీక్షకులను హెచ్చరించాడు.  

కొన్ని రోజుల క్రితం పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఇలానే నలుగురు స్నేహితులు బీఎండబ్ల్యూ కారులో వేగంగా కారు నడిపి ప్రమాదానికి గురయ్యారు. ప్రమాదానికి ముందు ఈ నలుగురూ కారు వేగాన్ని చూపిస్తూ ఫేస్ బుక్ లో లైవ్ వీడియో చేశారు. అప్పటికే 230 కి.మీ. వేగం అందుకోగా.. డ్రైవర్ 300 కి.మీ. వేగం అందుకోవడానికి ప్రయత్నించాడు. అలా చేస్తే మనం నలుగురం చనిపోతాం అని మరో వ్యక్తి చెప్పడం వినిపించింది. అతను అన్నట్టుగానే తీవ్ర వేగంతో కారు.. ట్రక్కును ఢీకొట్టి నుజ్జు నుజ్జయింది. ఈ ప్రమాదంలో కారులోని నలుగురూ అక్కడికక్కడే మృతి చెందారు.


More Telugu News